Ap news: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి (వైసీపీ) ఇవాళ భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒంగోలు మరియు తిరుపతి నగరపాలక సంస్థలకు చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో ఈ చేరికలు ఘనంగా జరిగాయి.
ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 20 మంది కార్పొరేటర్లు బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన కండువాలు కప్పుకుని పార్టీలో చేరారు. వారికి పవన్ సాదరంగా స్వాగతం పలికారు. ఇదివరకు మేయర్, డిప్యూటీ మేయర్ సహా 19 మంది కార్పొరేటర్లు ఇప్పటికే జనసేనలో చేరగా, ఇప్పుడు మరో 20 మంది రావడంతో ఒంగోలు కార్పొరేషన్‌లో వైసీపీ పరిస్థితి దారుణంగా మారింది. ఒకప్పుడు 43 మంది సభ్యుల బలం కలిగిన వైసీపీ, ప్రస్తుతం కేవలం నాలుగు స్థానాలకు పరిమితమైంది. ఈ కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ కూడా జనసేనలో చేరారు.
అదే విధంగా, తిరుపతిలోనూ జనసేనకు భారీగా చేరికలు జరిగాయి. జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు నాయకత్వంలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరారు. వారికి పవన్ కల్యాణ్ స్వయంగా జనసేన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ చేరికలతో జనసేన శక్తివంతమవుతుండగా, వైసీపీలో కలవరం మొదలైంది.