KCR: బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లోకి మళ్లీ రానున్నారు. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి పాలు అయిన నాటి నుంచి ఈ నాటి వరకు ఆయన ఎలాంటి క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి ఏడాది గడువు ఇద్దామని, ఆ తర్వాత పనితనంపై ప్రజల్లోకి వెళ్దామని తొలినాళ్లలోనే కేసీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆయన అనుకున్నట్టు ఇప్పటికే కాంగ్రెస్ పాలనకు ఏడాది దాటింది. దీంతో ప్రజల్లోకి వచ్చేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
KCR: ఈ రోజు (ఫిబ్రవరి 19న) బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన హైదరాబాద్ తెలంగాణ భవన్‌కు కేసీఆర్ రానున్నారు. ఆయన ఆరు నెలల విరామం తర్వాత పార్టీ కార్యాలయంలో అడుగుపెట్టనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్న కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జడ్పీల మాజీ చైర్మన్లు సహా సుమారు 400 మందికి ఆహ్వానం పలికారు.
KCR: బీఆర్ఎస్ కీలక భేటీలో సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడంతోపాటు చేపట్టాల్సిన రాజకీయ కార్యకలాపాలపై చర్చించనున్నారు. భవిష్యత్తు రాజకీయ అంశాలపై కేసీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ పేరిట నాడు ఆవిర్భవించిన బీఆర్ఎస్ వచ్చే ఏప్రిల్ 27న నాటికి 25 ఏండ్లు పూర్తి చేసుకోనున్నది. ఈ సందర్భంగా రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
KCR: ఈ నేపథ్యంలో వచ్చే రెండు నెలలపాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపేలా సన్నాహక కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అదే విధంగా సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాల షెడ్యూల్‌ను కూడా ఈ భేటీలోనే ప్రకటించే అవకాశం ఉన్నది.
KCR: అదే విధంగా ఎప్పటి నుంచో బీఆర్ఎస్ పార్టీ భావిస్తూ వస్తున్న కేసీఆర్ బహిరంగ సభ విషయంపైనా ఈ సమావేశంలోనే చర్చించే అవకాశం ఉన్నది. ఒక భారీ సభతో కేసీఆర్ మళ్లీ జనంలోకి వెళ్లనున్నారని తెలిసింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే లక్ష్యంగా ఆయన భవిష్యత్తు రాజకీయ పోరాటంలోకి దిగుతారని పార్టీవర్గాలు తెలిపాయి. అందుకే ఆ బహిరంగసభ తేదీ, ప్రాంతం, అంశంపై కేసీఆర్ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉన్నది.
రైతు రుణమాఫీ, రైతు భరోసా, లగచర్ల భూ పోరాటం, హైడ్రా ఆగడాలపై ఉద్యమం, రైతు ఆత్మహత్యలపై, ఆటో కార్మికుల సమస్యలపై అధ్యయన కమిటీలు వేసే విషయంపైనా బీఆర్ఎస్ కీలక భేటీలో చర్చించనున్నారు. గురుకులాల్లో నెలకొన్న సమస్యలు, గురుకుల విద్యార్థుల ఆత్మహత్యల సమస్యలపైనా పోరాటాలపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్, సోషల్ మీడియా కార్యకర్తల టార్గెట్‌గా పోలీసులు పెడుతున్న కేసులపైనా పోరాటంపై చర్చించనున్నారు.