Harish Rao: కేసీఆర్ పదిహేనేళ్ల క్రితం ఆమరణ నిరాహార దీక్షకు దిగి ఢిల్లీ పీఠాన్ని కదిలించారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు చెప్పారు. 2009 డిసెంబర్ 9న తెలంగాణకు అనుకూలంగా ప్రకటన రావడంలో కీలకపాత్ర పోషించినది కేసీఆర్ ఆ రోజు చేపట్టిన దీక్షే అని ఆయన వివరించారు. కేసీఆర్ దీక్ష చేయకపోతే, తెలంగాణ ప్రకటన వచ్చిన బట్టి ఉండేది కాదని ఆయన అభిప్రాయపడారు.
అప్పటి కేంద్రమంత్రి చిదంబరం, కేసీఆర్‌ను నిరాహార దీక్ష విరమించమని కోరినప్పుడు, కేసీఆర్ “తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామనే ప్రకటించండి, అప్పుడు దీక్ష విరమిస్తాను” అని స్పష్టంచేశారు. ఆ రోజు దీక్ష సమయంలో కేసీఆర్‌ను చూసి మనకు కళ్లలో నీళ్లు వచ్చాయన్నారు. అనంతరం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు సంబంధించిన వివరాలను జయశంకర్ తన స్వహస్తాలతో రాసి ఢిల్లీకి పంపించినట్లు ఆయన చెప్పారు, దానినే చిదంబరం ఢిల్లీ నుండి ప్రకటించారని చెప్పారు.
ఫిబ్రవరి 17 (కేసీఆర్ పుట్టిన రోజు) మనకు ఎంత ముఖ్యమో నవంబర్ 29 కూడా అంతే ముఖ్యమని హరీశ్ రావు అన్నారు. ఈ రెండు తేదీలు చరిత్ర పుటల్లో అత్యంత ప్రాముఖ్యమైనవి అని ఆయన పేర్కొన్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగిన రోజు తెలంగాణ ఉద్యమంలో కీలకమైన క్షణం. మనం మహాత్మా గాంధీ సత్యాగ్రహం, పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్షలు చూశామనుకుంటే, కేసీఆర్ కూడా అలానే నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడినట్లు ఆయన చెప్పారు.

