Jasprit Bumrah

Jasprit Bumrah: బుమ్రా భవిష్యత్తు తేలేది నేడే..! టెన్షన్ లో భారత అభిమానులు

Jasprit Bumrah: టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తుది నిర్ణయం నేడే తీసుకోనుంది. బుమ్రా గాయాల స్కాన్ ఫలితాలను వైద్యులు పరిశీలించి, మంగళవారం బీసీసీఐకి నివేదిక సమర్పించనున్నారు. అయితే, బుమ్రా లీగ్ దశ మ్యాచ్‌లకు దూరమవుతాడనే వార్తలు వెలుగుచూస్తున్నాయి.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ప్రకటించిన జట్టులో మార్పులు చేసేందుకు మరో మూడు రోజుల గడువు ఉంది. ఈ నేపథ్యంలో, బుమ్రా విషయంలో జాగ్రత్తగా ఉండాలని బీసీసీఐ అనుకుంటోంది. వైద్య నివేదిక ప్రకారం బుమ్రా ఆడలేడని తేలితే మాత్రమే అతన్ని జట్టు నుంచి తొలగించాల్సిన పరిస్థితి నెలకొంది.

జట్టులో మార్పులు చేసే గడువు ముగిసిన తర్వాత మార్పులు చేయడానికి ఐసీసీ టెక్నికల్ టీమ్ అనుమతి అవసరం. అయితే, బుమ్రాను నాకౌట్ దశ మ్యాచ్‌లకు మాత్రమే ఆడించాలని బీసీసీఐ ఆలోచిస్తోంది. అప్పటి వరకు హర్షిత్ రాణాను బుమ్రా స్థానంలో ఉపయోగించాలని ప్రతిపాదిస్తున్నారు. బుమ్రా బ్యాకప్‌గా రాణాను సిద్ధం చేస్తూనే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో ఆడించారు.

Also Read: GBS Case: మహారాష్ట్రలో ఆగని గిలియన్-బారే సిండ్రోమ్ (GBS) వ్యాధి.. 192కు చేరిన బాధితులు

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన జట్టులో అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ షమీ ప్రధాన పేసర్లుగా ఉన్నారు, పేస్ ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా ఉన్నాడు. బుమ్రా లీగ్ మ్యాచ్‌లకు లేకపోయినా, ఈ ముగ్గురితో టీమిండియా బలంగానే ఉందని టీం మేనేజ్మెంట్ ఆశిస్తోంది. బుమ్రా నాకౌట్ దశలో ఉంటే, టీమిండియా బలం మరింత పెరుగుతుందని వారు భావిస్తున్నారు.

Jasprit Bumrah: ప్రస్తుతం బుమ్రా ఎన్‌సీఏలో రిహాబిలిటేషన్ తీసుకుంటున్నాడు, జిమ్‌ కు కూడా వెళ్తున్నాడు. ఇక అప్పుడప్పుడు ఫిజియోల పర్యవేక్షణలో బౌలింగ్ చేస్తున్నాడు. బుమ్రా స్కాన్ ఫలితాలను పరిశీలించి వైద్యులు మంగళవారం నివేదిక ఇస్తారని తెలుస్తోంది. బుమ్రా ఆడలేకపోతే అతని స్థానంలో ఎవరు ఆడతారు అనేది ఒక పెద్ద ప్రశ్న. బుమ్రా బ్యాకప్‌గా హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీలను ఎంపిక చేసే అవకాశం లేకపోలేదు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో వీరికి ఇందుకోసమే అవకాశాలు ఇచ్చారు. హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తీ ఈ సిరీస్ లోనే ఆరంగేట్రం చేశారు.

బుమ్రా లేకపోతే హర్షిత్ రాణాకు అవకాశం ఉంటుంది. మహమ్మద్ సిరాజ్‌ను కూడా ఎంపిక చేసే అవకాశం ఉన్నప్పటికీ, హర్షిత్ రాణాను మాత్రమే ఎంపిక చేసే అవకాశాలే ఎక్కువ. దుబాయ్ పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండడంతో, హర్షిత్ రాణాతో పాటు వరుణ్ చక్రవర్తీని తీసుకోవడం వల్ల వాషింగ్టన్ సుందర్‌పై వేటు పడే అవకాశం ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *