Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ, పాత కార్డుల్లో మార్పులు, చేర్పులకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఎన్నికల సంఘం (ఈసీ) బ్రేక్ వేసిందన్న వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం మీసేవ కేంద్రాల ద్వారా కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా సుమారు 41 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇదే క్రమంలో ప్రజాభావన్, జిల్లాల్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాలు, గ్రామ-వార్డు సభల్లో పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. అర్హులకు కార్డులు అందించేందుకు మీసేవ ద్వారా దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అయితే, కొత్త రేషన్ కార్డుల జారీకి ఈసీ బ్రేక్ వేసిందని వస్తున్న వార్తలపై స్పష్టతనిచ్చింది. కొత్త కార్డుల జారీపై తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఏ విధమైన ఆంక్షలు విధించలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న వార్తల్లో నిజం లేదని ఈసి చెప్పింది.

