varginia scientist:అమ్మానాన్నలది పండుగలు చేసి పొట్టపోసుకునే కుల వృత్తి.. అత్యంత కడు బీదరికం.. మేకలు, పశువులను కాసుకుంటూ గడిపిన బాల్యం.. కష్టాలను ఎదుర్కొంటూ చదివిన దైన్యం.. ఇవన్నీ ఆ యువకుడి సంకల్పానికి అడ్డుకాలేదు. ఆటుపోటులతో ఎదురీదాడు.. నేడు ప్రపంచమే గర్వించదగ్గ స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగాడు. స్ఫూర్తిదాయకమైన ఆ యువకుడు మన తెలుగింటి యువకుడే కావడం ముదావహం.
varginia scientist:తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలకేంద్రానికి చెందిన వెంకటయ్య, లక్ష్మి దంపతులపెద్ద కుమారుడు చిన్నపాక సోమయ్య. చిన్నతనం నుంచి మేకలు, పశువులను కాస్తూ, వారి బైండ్ల కులవృత్తిగా పండగలు చేసుకునే జీవన విధానంలో నే పెరిగాడు. అదే గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలోనే విద్యారంభం చేసి, పండుగలు చేసుకుంటూనే పదో తరగతి వరకు తన చదువును పూర్తిచేశాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ, సమయం దొరకకపోయినా పశువులను, మేకలను కాస్తూనే తన విద్యాభాస్యాన్ని కొనసాగించాడు.
varginia scientist:ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణుడై నేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా కొడిగెనహళ్లి ఆంధ్రప్రదేశ్ గురుకుల జూనియర్ కలశాల (ఏపీఆర్జేసీ) లో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు సోమయ్య. కర్నూలులోని సిల్వర్ జూబిలీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బి.ఎస్.సి బయోకెమిస్ట్రీలో డిగ్రీ చేశాడు. ఆ తరువాత దేశ వ్యాప్తంగా పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులై హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆనిమల్ బయోటెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ పొందాడు.
varginia scientist:ఆ తర్వాత, ఐఐటీ గువాహటిలో పీహెచ్‌డీ (డాక్టరేట్) పూర్తి చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ప్రముఖ విశ్వవిద్యాలయల్లో ఉత్తీర్ణులై అమెరికాలోని ఇల్లినాయిస్ యూనివర్సిటీ, పిట్స్‌బర్గ్ యూనివర్సిటీ, టెక్సాస్ సౌత్‌వెస్ట్రన్ మెడికల్ సెంటర్, డల్లాస్ యూనివర్సిటీల్లో పోస్ట్‌డాక్టరల్ రీసెర్చ్ అసోసియేట్‌గా సోమయ్య పరిశోధనలు కొనసాగించారు.
varginia scientist:ప్రస్తుతం ఆయన అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయంలో స్టెం సెల్స్, క్యాన్సర్ బయాలజీ పరిశోధనల్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. ఆయన చేసిన విఙ్ఞాన పరిశోధన ద్వారా క్యాన్సర్ రోగుల చికిత్సలో సహకరించగలిగారు. శాస్త్రవేత్తగా తన ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం, త్వరలో ప్రొఫెసర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించబోతున్నారు. చిన్ననాటి పేదరికం నుంచి ప్రపంచ స్థాయి శాస్త్రవేత్తగా ఎదిగిన ఈ స్ఫూర్తిదాయక వ్యక్తి, తెలుగు ప్రజలకే కాకుండా దేశానికీ గర్వకారణంగా నిలిచారు.