Delhi Assembly Elections 2025:దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలపై దేశమంతటా ఉత్కంఠ నెలకొన్నది. ఈ రోజు ఫిబ్రవరి 5న జరుగుతున్న ఈ ఎన్నికలపై హైప్ క్రియేట్ అయింది. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మరింత క్రేజ్ ఏర్పడింది. కీలకమైన రాజధానిని నిలబెట్టుకోవాలని, జాతీయస్థాయిలో విస్తరించాలని కేజ్రీవాల్ నేతృత్వంలోనే ఆప్ భావిస్తుండగా, దేశమంతా ఉన్నా గుండెకాయ లాంటి ఢిల్లీలో పాగా వేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతున్నది. వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపేందుకు కాంగ్రెస్ ఆసక్తిని కనబరుస్తున్నది.
Delhi Assembly Elections 2025:ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఈ రోజు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తంగా 1.56 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ ఎన్నికలు అధికార పార్టీ ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యన త్రిముఖ పోటీ నెలకొన్నది.
Delhi Assembly Elections 2025:ఢిల్లీ రాష్ట్రంలో 70 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 13,766 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 3,000 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. ఈ ఎన్నికల బరిలో వివిధ పార్టీల తరఫున 699 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
Delhi Assembly Elections 2025:ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో 35 వేల మంది పోలీసు బలగాలు బందోబస్తు నిర్వహిస్తున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో డ్రోన్ల సహాయంతో పర్యవేక్షణ కొనసాగుతున్నది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎక్కడికక్కడ పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. గస్తీని ముమ్మరంగా నిర్వహిస్తున్నది.
ఇదేరోజు ఫిబ్రవరి 5న సాయంత్రం 6.30 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతాయి. ఫిబ్రవరి 8న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతాయి. అదేరోజు ఫలితాలు వెల్లడవుతాయి.

