Budget Story

Budget Story: బడ్జెట్ లో ప్రకటించినంత మాత్రాన ధరలు తగ్గిపోవు.. ఎందుకంటే..

Budget Story: మనలో చాలామందికి గుర్తుండే ఉంటుంది. గతంలో అంటే ఓ ఏడెనిమిదేళ్ల క్రితం బడ్జెట్ వస్తోంది అంటే.. ఏ ధరలు తగ్గుతాయి.. ఏ ధరలు పెరుగుతాయి అనే విషయంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. బడ్జెట్ లో ఏదైనా వస్తువుపై ధరలు పెరిగే ఛాన్స్ ఉంది అనే సమాచారం లేదా అంచనా ఉంటే ఆ వస్తువు బడ్జెట్ కు రెండు నెలల ముందు నుంచే బ్లాక్ అయిపోయేది. వినియోగదారులకు ధరలను పెంచి అమ్మేయడం మొదలు పెట్టేవారు. ఉదాహరణకు సిగరెట్లు(Cigarette).. ప్రతి బడ్జెట్ లోనూ సిగరెట్లపై టాక్స్ పెరుగుతుంది అని ఒక అంచనా ఉండేది. దీంతో బడ్జెట్ వచ్చే నెల రోజుల ముందు నుంచి మార్కెట్లో సిగరెట్ల లభ్యత తగ్గిపోయేది. ధరలను పెంచి అమ్మేసేవారు.

ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. బడ్జెట్ అంటే ధరలు పెరగడం.. తిరగడమే కాదు ఇంకా చాలా ఉంటుంది అనే విషయం ప్రజలకు అర్ధం అయిపొయింది. అంతేకాకుండా బడ్జెట్ లో ఏదైనా టాక్స్ పెరుగుతుంది అంటే అది ఆ వస్తువు ధరపై నేరుగా ప్రభావం చూపించడం లేదు. దీనికి కారణం జీఎస్టీ. ఉదాహరణకు గతంలో ఎలక్ట్రానికి వస్తువులపై బడ్జెట్ లో ఏదైనా ప్రకటన వస్తే వెంటనే ఆ వస్తువుల ధరలు తగ్గడం లేదా పెరగడం జరిగేది. కానీ, ఇప్పుడు ఎలక్ట్రానిక్ వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించినా.. ఆ ప్రభావం ధరలలో కనిపించడం లేదు. దీనికి కారణం తెలుసుకోవాలంటే.. ఈ విషయాలు అర్ధం చేసుకోవాలి

బడ్జెట్ లో వస్తువుల ధరలు ఎలా పెరుగుతాయి లేదా తగ్గుతాయి?

బడ్జెట్‌లో ఏ ప్రోడక్ట్ కూడా నేరుగా చౌకగా లేదా ఖరీదైనది కాదు. కస్టమ్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ వంటి పరోక్ష పన్నులను పెంచడం లేదా తగ్గించడం వల్ల వస్తువులు చౌకగా, ఖరీదైనవిగా మారతాయి. సుంకం పెరుగుదల – తగ్గింపు వస్తువుల ధరలపై పరోక్ష ప్రభావం చూపుతుంది.

ఇది కూడా చదవండి: Rope Car Project: కేంద్రం మాస్టర్ ప్లాన్.. అమరనాధ్.. శబరిమల ఆలయాలకు రోప్‌కార్ సర్వీసులు..

దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. బంగారంపై దిగుమతి సుంకాన్ని 10% తగ్గిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రకటించింది. దీని ప్రభావంతో విదేశాల నుంచి బంగారం దిగుమతి చేసుకోవడం 10% చౌకగా మారనుంది. అంటే బంగారు ఆభరణాలు, బిస్కెట్లు, నాణేల ధరలు తగ్గనున్నాయి. కానీ, అది వినియోగదారుని వరకూ చేరాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. అన్ని స్థాయిల్లోనూ ఈ తగ్గుదల అమలు కావాల్సిఉంటుంది. అంటే దిగుమతి చేసుకున్న దగ్గర నుంచి అది వినియోగదారునికి చేరుకునే వరకూ తగ్గిన కస్టమ్స్ డ్యూటీని అమలు చేసుకుంటూ రావాలి. అయితే, అది అలా జరగదు. డిమాండ్ ను బట్టి ధరలు నిర్ణయిస్తారు. ఉదాహరణకు పది కేజీల బంగారం దిగుమతి చేసుకున్నారని అనుకుందాం. కానీ, డిమాండ్ 12 కేజీలకు ఉందంటే అప్పుడు దాని ధర పెరిగిపోతుంది. దీనిపై జీఎస్టీ ప్రభావం ఎలానూ ఉంటుంది. అందువల్ల బడ్జెట్ లో ఏదైనా తగ్గించినంతలో మనకి మార్కెట్లో ధరలు తగ్గిపోతాయి అని అనుకోవడం పూర్తిగా కరెక్ట్ కాదు.

అసలు పరోక్ష పన్ను అంటే ఏమిటి?

పన్నులు ప్రత్యక్ష పన్ను – పరోక్ష పన్నులుగా ఉంటాయి.

i. ప్రత్యక్ష పన్ను: ఇది ప్రజల ఆదాయం లేదా లాభాలపై విధించే పన్ను. ఆదాయపు పన్ను, వ్యక్తిగత ఆస్తి పన్ను వంటి పన్నులు దీని పరిధిలోకి వస్తాయి. ప్రత్యక్ష పన్ను భారం ఎవరిపై విధించబడిందో నేరుగా ఆ వ్యక్తిపైనే భారం పడుతుంది. దానిని మరెవరికీ బదిలీ చేయలేరు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) దీనిని నియంత్రిస్తుంది.

ii. పరోక్ష పన్ను: ఇది వస్తువులు-సేవలపై విధించే పన్ను. కస్టమ్ డ్యూటీ, ఎక్సైజ్ డ్యూటీ, జీఎస్టీ, వ్యాట్, సర్వీస్ ట్యాక్స్ వంటి పన్నులు దీని పరిధిలోకి వస్తాయి. పరోక్ష పన్నును ఒకరి నుంచి మరొకరికి మార్చవచ్చు.

హోల్‌సేల్ వ్యాపారి దానిని రిటైలర్‌లకు.. వారు దానిని వినియోగదారులకు బదిలీ చేస్తారు. అంటే, దాని ప్రభావం అంతిమంగా వినియోగదారులపై మాత్రమే పడుతుంది. ఈ పన్ను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ పరోక్ష పన్నులు – కస్టమ్స్ (CBIC)చే నిర్వహించబడుతుంది.

ఇంకా చెప్పాలంటే.. ప్రభుత్వం జూలై 1, 2017న దేశవ్యాప్తంగా GSTని అమలు చేసింది. దాదాపు 90% ఉత్పత్తులు GST పరిధిలోకి వస్తాయి. GSTకి సంబంధించిన అన్ని నిర్ణయాలను GST కౌన్సిల్ తీసుకుంటుంది. అందువల్ల, బడ్జెట్‌లో ఈ ఉత్పత్తుల ధరలలో ఎటువంటి మార్పు ఉండదు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *