Rs praveen kumar: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన, గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు, చేసిన ప్రయత్నాలను గుర్తుచేశారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం మోబిలిటీ వ్యాలీ అనే ప్రాజెక్ట్ను ప్రతిపాదించిందని, ఇది వేలాది ఉద్యోగాలు అందించడంతో పాటు కోట్లాది రూపాయల ఆదాయం తీసుకొచ్చేదని చెప్పారు. ఆ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో ఒక గొప్ప ఇండస్ట్రీ స్థాపించి, అభివృద్ధికి కొత్త దిశ ఇచ్చేందుకు ప్రయత్నించామని పేర్కొన్నారు. అలాగే, ఫార్ములా ఈ రేస్ వంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపులోకి తీసుకువచ్చామని చెప్పారు.
కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల మోబిలిటీ వ్యాలీ ప్రాజెక్ట్ రాకుండా పోయిందని, దీంతో రాష్ట్రానికి భారీ నష్టం కలిగిందని ఆయన ఆరోపించారు. “రాష్ట్ర ఖజానాకు పన్నులు చెల్లించే ఓ పౌరుడిగా, ఈ నిర్ణయాల వల్ల నాకు కూడా నష్టం జరిగింది. కాకుండా, తెలంగాణ ప్రజలందరికీ నష్టం జరిగిందని” ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఉద్యోగావకాశాలు కోల్పోవడం
తెలంగాణలో వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం కోల్పోయిన మనం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని ప్రవీణ్ పేర్కొన్నారు. “గత ప్రభుత్వం లక్షలాది మంది ప్రజలకు ఉద్యోగాలు అందించేందుకు, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేందుకు భారీ ప్రాజెక్టులు ప్రతిపాదించింది. కానీ, ప్రస్తుత ప్రభుత్వం వాటిని ముందుకు తీసుకెళ్లడం గానీ, అమలు చేయడం గానీ చేయకపోవడం వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోంది” అని విమర్శించారు.
ఈ నేపథ్యంలో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రేవంత్ రెడ్డిపై కేసు నమోదు చేయనున్నట్లు ప్రకటించారు. “ముఖ్యమంత్రిపై పూర్తి సమాచారం సేకరించి, రీసెర్చ్ చేసి, నా ఫిర్యాదులో పొందుపరిచాను” అని తెలిపారు. “తెలంగాణ ప్రజల హక్కులు, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ పోరాటం కొనసాగుతుంది” అని ఆయన స్పష్టంచేశారు.

