Pawan Kalyan: అమెజాన్ గిఫ్ట్ కార్డు సమస్యపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి స్పందించారు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు పూర్తిగా పారదర్శకంగా ఉండాలని ఆయన సూచించారు. గిఫ్ట్ కార్డుల్లోని డబ్బులను కస్టమర్ల బ్యాంకు ఖాతాలోకి సులభంగా ట్రాన్స్‌ఫర్ చేసుకునే వెసులుబాటు కల్పించాలని పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.
పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గిఫ్ట్ కార్డుల్లో డబ్బు జమ చేయడం చాలా సులభమని, యూపీఐ లేదా కార్డు సమాచారాన్ని ఎంటర్ చేస్తే సరిపోతుందని తెలిపారు. అయితే, గడువు ముగిసిన గిఫ్ట్ కార్డుల్లోని డబ్బును రికవరీ చేయడం మాత్రం చాలా కష్టమని పేర్కొన్నారు. వినియోగదారులు కస్టమర్ సర్వీస్‌ను సంప్రదించి, తమ సమస్యను వివరించాల్సి వస్తుందని, దీని తర్వాత సుదీర్ఘ ప్రక్రియలో డబ్బు బ్యాంకు ఖాతాలోకి వస్తుందని చెప్పారు.
గడువు ముగిసిన గిఫ్ట్ కార్డుల డబ్బులు ఆటోమేటిక్‌గా వినియోగదారుల బ్యాంకు ఖాతాలోకి జమయ్యే విధానాలను ఎందుకు అమలు చేయకూడదని ఆయన ప్రశ్నించారు. ఈ విధానం అమలు చేయడం వల్ల వినియోగదారులు నష్టపోకుండా ఉంటారని, అలాగే ఈ-కామర్స్ సంస్థలు వినియోగదారుల నమ్మకాన్ని పొందవచ్చని అన్నారు. సులభతరమైన విధానాలను అమలు చేయడంతో పాటు ఈ వ్యవస్థను పారదర్శకంగా మార్చాలని అమెజాన్‌తో పాటు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్బీఐని పవన్ కల్యాణ్ కోరారు.