Telangana Villages: తెలంగాణ పల్లెజనం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హింట్ రానే వచ్చింది. 8 నెలల క్రితమే జరగాల్సిన ఎన్నికలు వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చాయి. సెప్టెంబర్, అక్టోబర్‌లో పంచాయతీ ఎన్నికలంటూ మళ్లీ వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ లోగా సెప్టెంబర్ గడిచిపోగా, అక్టోబర్ సగం పూర్తికావచ్చింది. ఇదే సమయంలో బీసీ కులగణన జరిపి, రిజర్వేషన్ల సంఖ్యను పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని, బీసీ సంఘాలు పట్టుబడుతూ వచ్చాయి.
Telangana Villages: ఈ డోలాయమాన పరిస్థితుల్లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయోనని అయోమయం నెలకొన్నది. ఈ దశలో తాజాగా ఓ మీటింగ్‌లో పాల్గొన్న సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. జనవరి 26లోపు పంచాయతీ ఎన్నికలను పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇదే దశలో బీసీ కులగణనకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ సమయంలోనే ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషన్ వేసింది. ఈ రెండు కమిటీల నివేదికలు ఇచ్చేందుకు 60 రోజుల గడువు విధించింది.
Telangana Villages: ప్రభుత్వం ఇచ్చిన గడువు మేరకు బీసీ కులగణన, ఎస్సీ కమిషన్ నివేదికలను డిసెంబర్‌లో ఇచ్చే అవకాశం ఉన్నది. బీసీ కులగణన ఆధారంగా అదే నెలలో పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లను ఖరారు చేయొచ్చు. అంతా అనుకున్నట్టే జరిగితే జనవరి నెలలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవుతుంది. ఆ వెంటనే ఎన్నికలు జరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Telangana Villages: సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటనతో ఊరూరా సందడి నెలకొన్నది. ఆశావహులు అందరినీ కలుసుకొని తమ మనసులోని మాటను వల్లెవేస్తున్నారు. యువతను చేరదీసి దసరా రోజు దావత్‌లు ఇస్తున్నారు. సమస్యలున్న వారిండ్ల వద్ద వాలి మేమున్నామంటూ కలరింగ్ ఇస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ఊరిలో ఓ ఆశావహుడు ఏకంగా సర్పంచ్ ఎన్నికల్లో తాను గెలిస్తే చేపట్టబోయే ఎజెండా అంశాలను ప్రకటించేశాడు. ఇల్లిల్లూ తిరుగుతూ ప్రచారమే మొదలుపెట్టాడు. ఇలా ఊరూరా చిన్నా చితక లీడర్లు గల్లీలు తిరుగుతూ చెమటోడుస్తున్నారు.

