Tirumala: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా ఉన్న దివ్వెల మాధురిపై కేసు నమోదైంది. టీటీడీ నిబంధనలు, సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ దువ్వాడ శ్రీనివాస్‌తో సహజీవనం చేస్తున్న వ్యక్తిగత విషయాలను తెలుపుతూ తిరుమలలో సోషల్ మీడియాలో రీల్స్ ప్రచురించడం పై అధికారులు సీరియస్ అయ్యారు.
శ్రీవారి ఆలయ ప్రాంగణం, పుష్కరిణిలో రీల్స్ షూట్ చేయటం భక్తుల మనోభావాలను దెబ్బతీసెల ఉందని దివ్వెల మాధురి పై కేసు ఫైల్ అయ్యింది. టెంపుల్ ఏవిఎస్వో ఫిర్యాదు మేరకు….292, 296, 300 BNS Sec 66(E) IT Act, 2000-2008 కింద వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కేసు ఎందుకు పెట్టారంటే..
ఈనెల 7న మాధురి, దువ్వాడ శ్రీనివాస్ తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల కొండపై మాధురి ఫొటోషూట్, రీల్స్ చేశారు. అయితే, ఆ రీల్స్ ఇప్పుడు దివ్వెల మాధురిని చిక్కుల్లోకి నెట్టింది.
ఆలయం ఎదుట ఆమె రీల్స్ చేయడంపై భక్తుల నుంచి విమర్శలు వచ్చాయి. ఇది టీటీడీ నిబంధనలు, ఆలయ సంస్కృతిని ఉల్లంఘించడమేనని పలువురు భక్తులు, టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు. పరమ పవిత్రమైన శ్రీవారి పుష్కరిణితో పాటు ఆలయం వద్ద ఫొటో షూట్ చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
తమ వ్యక్తిగత విషయాలను మీడియాతో పంచుకుంటూ సహజీవనం చేస్తున్నామని ఆమె వెల్లడించారు. దీని ద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ అధికారి ఎం.మనోహర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.