IND vs Ban T20: బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ ను 2-0 తేడాతో టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. ఢిల్లీ వేదికగా బంగ్లాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో ఘన విజయంతో సూర్య సేన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలివుండగానే సొంతం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ ఆల్ రౌండర్ నితీశ్ కుమార్‌రెడ్డి విధ్వంసక బ్యాటింగ్.. రింకూసింగ్ నిలకడైన ఇన్నింగ్స్.. హార్థిక్ పాండ్యా బ్యాటింగ్ మెరుపులతో టీమ్ ఇండియా 221 పరుగులు చేయగా.. భారత బౌలర్ల ధాటికి 9 వికెట్లకు 135 పరుగులే చేసి ఘోరంగా ఓడింది బంగ్లాదేశ్.
IND vs Ban T20: టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు శుభారంభం దక్కలేదు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో ఓపెనర్లు సంజు శాంసన్ 10 పరుగులకు, అభిషేక్ 15 పరుగులకు, సూర్యకుమార్ 8 పరుగులకే ఔటయ్యారు. పవర్‌ప్లే ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 45 పరుగులు మాత్రమే చేసింది. దీంతో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ఆటగాళ్లలో సంతోషం కనిపించింది. సూర్య సేనను తక్కువ స్కోరుకే పరిమితం చేయగలమన్న నమ్మకం కలిగింది. కానీ, కొత్త కుర్రాడు రెండో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న నితీశ్‌కుమార్ రెడ్డికి తోడు రింకు కూడా రెచ్చిపోవడంతో అరుణ్ జైట్లీ స్టేడియంలో పరుగుల వరద పారింది. అవకాశాన్ని పూర్తిగా అందిపుచ్చుకున్న నితీశ్.. బౌలర్లను ఏమాత్రం లెక్క చేయకుండా బ్యాట్‌కు పనిచెప్పాడు. చూడముచ్చటైన పక్కా క్రికెటింగ్ షాట్లతో ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లు బాదేస్తూ కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు రింకు కూడా అతడితో పోటీపడి మోత మోగించడంతో బంగ్లా బౌలర్లకు దిక్కు తోచలేదు. నితీశ్, రింకు నాలుగో వికెట్‌కు 49 బంతుల్లో 108 పరుగులు జోడించి టీమిండియా బ్యాటింగ్ ను నిలబెట్టారు. 4 ఫోర్లు, 7 సిక్సర్లతో నితీశ్‌కుమార్ రెడ్డి 74 రన్స్ చేయగా.. 5 ఫోర్లు, 3 సిక్సర్లతో రింకు సింగ్ 53 పరుగులతో సునామీ సృష్టించారు. చివరలో హార్ధిక్, రియాన్ పరాగ్ దంచి కొట్టారు. 2 సిక్సర్లు, 2 ఫోర్లతో హార్దిక్ పాండ్యా 32 రన్స్… 2 సిక్సర్లతో 6 బంతుల్లో రియాన్ 15 పరుగులు చేసి చివరలో బాదే బాధ్యతను అందుకున్నారు. దీంతో భారత్ 221 పరుగుల భారీస్కోరు నమోదు చేసుకుంది. బంగ్లా బౌలర్లలో రిషద్ హొస్సేన్ 3, ముస్తాఫిజుర్ 2, తంజిమ్ హసన్ 2, తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టారు.
IND vs Ban T20: 222 పరుగుల భారీ ఛేదనలో బంగ్లాదేశ్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే వచ్చింది. పర్వేజ్ హొస్సేన్ 16, లిటన్ దాస్ 14, నజ్ముల్ హుస్సేన్ శాంటో 11, తౌహిద్ హృదయ్ 2, మెహిదీ హసన్ 6, జాకర్ అలీ 1.. ఇలా బంగ్లా బ్యాటర్లు వరుసగా ఒకరివెంట మరొకరు పెవిలియన్ బాట పట్టారు. వందలోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన బంగ్లాను 39 బంతుల్లో 41 పరుగులు చేసిన మహ్మదుల్లా ఆదుకున్నాడు. బ్యాటింగ్ లో రాణించిన నితీశ్ కుమార్ రెడ్డి ..బౌలింగ్ లోనూ ఆకట్టుకున్నాడు. తన కోటా 4 ఓవర్లలో 23 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి 2, అభిషేక్ ,మయాంక్ యాదవ్, అర్ష్‌దీప్ తలో వికెట్ తీసి బంగ్లాను దెబ్బతీశారు. చివరకు బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసి 86 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో చివరి టీ20 మ్యాచ్ శనివారం హైదరాబాద్‌లో జరుగుతుంది.

