ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు నటుల పేర్లు, వారి కుటుంబాల పేర్లను వాడొద్దని ‘మా’ ప్రెసిడెంట్ మంచు విష్ణు ట్వీట్ చేశారు. ‘వినోదాన్ని అందించడానికి మేము ఎంతో కష్టపడుతున్నాం. మా వ్యక్తిగత జీవితాలను ప్రజా చర్చల్లోకి లాగొద్దు. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఇలాంటి ఘటనలు ఎంతో బాధను కలిగిస్తాయి. నా చిత్ర పరిశ్రమను ఎవరైనా బాధపెట్టాలని చూస్తే మౌనంగా ఉండను. మేమంతా ఏకమై నిలబడతాం’ అని హెచ్చరించారు.
‘సమాజంలో ఇటీవలి కాలంలో జరిగిన దురదృష్టకరమైన వ్యాఖ్యల నేపథ్యంలో.. వాటివల్ల కుటుంబాలకు కలిగిన బాధను ప్రస్తావించడం చాలా అవసరమని భావిస్తున్నా. మన పరిశ్రమ కూడా ఇతర రంగాల్లాగే పరస్పర గౌరవం, నమ్మకంతో నడుస్తుంది. నిజం కాని కథనాలను రాజకీయ లబ్ధి కోసం వాడటం చాలా నిరాశను కలిగించింది. మేము నటులుగా ప్రజల దృష్టిలో ఎప్పుడూ ఉంటాం.. కానీ మా కుటుంబాలు మాత్రం వ్యక్తిగతం. మిగిలిన అందరి కుటుంబాల్లాగే మాకు కూడా గౌరవం, రక్షణ అవసరం. ఎవరూ తమ కుటుంబ సభ్యులు టార్గెట్ అవ్వడం.. వారి వ్యక్తిగత జీవితాలపై అబద్ధపు ఆరోపణలు రావాలని ఇష్టపడరు. అదే విధంగా మేము కూడా మా కుటుంబాలకు గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం.’నోట్‌లో ప్రస్తావించారు.
‘రాజకీయ నాయకులు, ప్రభావవంతమైన వ్యక్తులకు నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి రాజకీయాల కోసం, ప్రజల దృష్టి ఆకర్షించడానికి మా సినిమాకు చెందిన వారి పేర్లు, కుటుంబాల పేర్లు వాడకండి. చిత్రపరిశ్రమలో పనిచేసేవారు వినోదం ఇవ్వడానికి ఎంతో కష్టపడుతున్నారు. మా వ్యక్తిగత జీవితాలను ప్రజాక్షేత్రంలోకి లాగొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మనమందరం ఒకరినొకరు గౌరవించుకోవాలి. కేవలం వృత్తి పరంగానే కాకుండా.. మనుషులుగా కూడా మన కుటుంబాలపై వచ్చే అబద్ధపు కథనాల వల్ల కలిగే బాధ చాలా తీవ్రమైంది. ఇలాంటి సంఘటనల బాధని మాత్రమే కలిగిస్తాయని మనమందరం అంగీకరిద్దాం. సినీ ఇండస్ట్రీ తరపున మా కుటుంబాలకు అనవసరమైన, హానికరమైన పరిస్థితుల నుంచి దూరంగా ఉంచమని వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. నా చిత్రపరిశ్రమను ఎవరు బాధపెట్టాలని చూస్తే నేను మౌనంగా ఉండను. మేము ఇలాంటి దాడులను తట్టుకోం. అవసరమైతే మేమంతా ఏకమై నిలబడతాం’ అంటూ లేఖ విడుదల చేశారు.
Official Statement from Movie Artists Association (MAA) pic.twitter.com/vc4SWsnCj6
— Vishnu Manchu (@iVishnuManchu) October 3, 2024

