CM Omar Abdullah: జమ్మూకశ్మీర్ శాసనసభలో శుక్రవారం కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. జమ్మూకశ్మీర్‌కు తక్షణమే పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను (Full Statehood) పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే సీఎం ఈ ప్రతిపాదనను తీసుకురావడంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి సభలో గందరగోళం నెలకొంది. నేషనల్ కాన్ఫరెన్స్ (NC), కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తూ ఈ తీర్మానానికి పూర్తి మద్దతు తెలపగా.. అజెండాలో లేని అంశాన్ని ఎలా తెస్తారంటూ బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
పార్లమెంట్, సుప్రీంకోర్టు సాక్షిగా ఇచ్చిన మాట ఏమైంది? – ఒమర్ నిలదీత
తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కేంద్ర ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో, సుప్రీంకోర్టులో, బహిరంగ సభల్లో జమ్మూకశ్మీర్ ప్రజలకు మూడు దశల హామీ ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు. మొదటిది డీలిమిటేషన్, రెండోది ఎన్నికలు, మూడోది రాష్ట్ర హోదా పునరుద్ధరణ.
-
2000 జూన్ 26న ఫారూక్ అబ్దుల్లా ప్రభుత్వం స్వయంప్రతిపత్తి కోసం తీర్మానం పాస్ చేసింది.
-
2024 నవంబర్ 6న ఆర్టికల్ 370 రద్దు అనంతరం ప్రత్యేక హోదా పునరుద్ధరణ కోరుతూ అసెంబ్లీ తీర్మానించింది.
-
వీటికి కొనసాగింపుగా.. కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ తాజా తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపాలని అసెంబ్లీని కోరారు.
రాష్ట్ర హోదా ఏ ఒక్కరి సొత్తో కాదు..
రాష్ట్ర హోదా లేకపోవడం వల్ల జమ్మూకశ్మీర్ తీవ్రంగా నష్టపోతోందని ఒమర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అధికార పక్షానికో, ప్రతిపక్షానికో సంబంధించిన విషయం కాదని.. జమ్మూకశ్మీర్ సమగ్ర భవిష్యత్తుకు సంబంధించిన అంశమని స్పష్టం చేశారు. బయట మాట్లాడటం కంటే అసెంబ్లీ వేదికగానే దీనిపై చర్చ జరగాలని, జరుగుతున్న సమావేశాల్లోనే దీనిపై సమగ్ర చర్చకు సమయం కేటాయించాలని స్పీకర్‌ను కోరారు.
