Gujarat 

Gujarat: రూ.10 వేల జీతం కోసం ఏకంగా రూ.24 కోట్ల మార్కెట్ తగలబెట్టాడు

Gujarat: గుజరాత్‌లోని సూరత్‌లో కేవలం పది వేల రూపాయల జీతం బకాయి వివాదం ఊహించని నష్టానికి దారితీసింది. మాజీ యజమాని తనకు రావాల్సిన డబ్బుని ఇవ్వకపోవడంతో పాటు ఉద్యోగం నుంచి తీసేశాడన్న కక్షతో రగిలిపోయిన ఓ అకౌంటెంట్ ఏకంగా టెక్స్‌టైల్ మార్కెట్‌కే నిప్పుపెట్టాడు. ఈ దారుణ ఘటనలో సుమారు 14 దుకాణాలు పూర్తిగా బూడిదై ఏకంగా రూ.24 కోట్ల విలువైన వస్త్రాలు, ఆస్తులు దగ్ధమయ్యాయి. తొలుత షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ప్రమాదంగా భావించినప్పటికీ, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో నిందితుడి అసలు కుట్ర బట్టబయలైంది.

రూ.10 వేల గొడవ – పెట్రోల్ పోసి విధ్వంసం..

సూరత్‌లోని ఓ టెక్స్‌టైల్ దుకాణంలో వినోద్ సాల్వే (వినోద్ పండి సావ్ల) అనే వ్యక్తి గతంలో అకౌంటెంట్‌గా పనిచేశాడు. అక్కడ కేవలం మూడు నెలలు మాత్రమే పనిచేసిన అనంతరం అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ సమయంలో అతనికి రావాల్సిన సుమారు రూ.10 వేల జీతం బకాయి నిలిచిపోయింది.
తనకు రావాల్సిన డబ్బుల కోసం వినోద్ మాజీ యజమానిని పలుమార్లు సంప్రదించినా ఫలితం లేకపోయింది. దీంతో తీవ్ర ఆక్రోశానికి లోనైన అతడు యజమానికి కోలుకోలేని నష్టం కలిగించాలని పక్కా ప్లాన్ వేశాడు.

రాత్రి వేళ మార్కెట్‌లోకి ప్రవేశించిన వినోద్.. సీసీటీవీల్లో కనిపించకుండా తిరుగుతూ దుకాణాల వద్ద వస్తువులను ధ్వంసం చేశాడు. వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను దుకాణాలపై పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు.

14 దుకాణాలు దగ్ధం – రూ.24 కోట్ల బూడిద..

టెక్స్‌టైల్ మార్కెట్ కావడంతో వస్త్రాలు, ప్యాకింగ్ మెటీరియల్స్ ఉండటంతో మంటలు నిమిషాల వ్యవధిలోనే పక్క దుకాణాలకు విస్తరించాయి. ఈ ప్రమాదంలో మొత్తం 14కు పైగా దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు రూ. 24 కోట్ల మేర భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
సీసీటీవీ ఫుటేజీతో నిందితుడి అరెస్ట్..

మార్కెట్‌లో మంటలు చెలరేగిన వెంటనే వ్యాపారులు, అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. మొదట దీన్ని ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా భావించిన పోలీసులు.. కేసు నమోదు చేసి క్షేత్రస్థాయిలోని సీసీటీవీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అందులో వినోద్ సంచరిస్తూ నిప్పంటిస్తున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించడంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. కేవలం రూ.10 వేల కోసం మొదలైన చిన్న వివాదం రూ.24 కోట్ల నష్టానికి, తీవ్ర క్రిమినల్ కేసుకు దారితీయడం స్థానికంగా పెను సంచలనం రేపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *