Equinox: విశ్వంలో నిరంతరం జరిగే అద్భుతాల్లో ‘విషువత్తు’ (Equinox) అత్యంత ప్రాముఖ్యమైనది. సాధారణంగా ఉదయం లేస్తే ఎండ, సాయంత్రం కాగానే చీకటి సహజమే అయినప్పటికీ.. ఏడాదిలో కేవలం రెండు రోజులు మాత్రమే భూమిపై పగలు, రాత్రి సమయాలు దాదాపు సమానంగా ఉంటాయి. అలాంటి అరుదైన ఖగోళ ఘట్టమే సెప్టెంబర్ ఈక్వినాక్స్. 2026 సంవత్సరానికి సంబంధించిన ఈ రెండో విషువత్తు సెప్టెంబర్ 23న భారత కాలమానం ప్రకారం ఉదయం 5:35 గంటలకు (UTC ప్రకారం అర్ధరాత్రి 00:05 గంటలకు) సంభవించింది. ఈ సమయంలో సూర్యకిరణాలు భూమధ్యరేఖపై నిట్టనిలువుగా పడటంతో ఉత్తర, దక్షిణార్ధగోళాలకు దాదాపు సమానమైన సూర్యకాంతి అందుతోంది.
అసలు ఈక్వినాక్స్ అంటే ఏమిటి? ఎందుకు జరుగుతుంది?
లాటిన్ భాషలో ‘ఈక్వి’ అంటే సమానం, ‘నాక్స్’ అంటే రాత్రి. అంటే సమాన రాత్రి అని దీని అర్థం. సాధారణంగా భూమి తన అక్షంపై సుమారు 23.5 డిగ్రీల కోణంలో వంగి సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తుంది. దీనివల్ల ఏడాదిలో ఎక్కువ భాగం ఏదో ఒక అర్ధగోళం సూర్యుడి వైపు ఎక్కువగా వంగి ఉండి, ఒకవైపు ఎండ ఎక్కువ, మరోవైపు తక్కువగా ఉంటుంది.
ఏడాదికి రెండుసార్లు మాత్రమే..
సంవత్సరంలో కేవలం రెండు సార్లు మాత్రమే సూర్యుడు సరిగ్గా భూమధ్యరేఖకు సూటిగా పైకి వస్తాడు. అప్పుడు భూమి ఏ వైపుకూ వంగి ఉండనట్లు కనిపిస్తుంది. మొదటి ఈక్వినాక్స్ మార్చి 20న జరగ్గా, రెండోది సెప్టెంబర్ 23న పూర్తయింది.
రెండు ధ్రువాలపై ఒకేసారి వెలుగు..
సాధారణ రోజుల్లో ఒక ధ్రువం వద్ద ఆరు నెలలు పగలు, మరో ధ్రువం వద్ద ఆరు నెలలు చీకటి ఉంటుంది. కానీ ఈక్వినాక్స్ రోజున భూమి అక్షం సూర్యుడికి సమాంతరంగా రావడం వల్ల ఉత్తర, దక్షిణ ధ్రువాలు రెండూ ఒకే సమయంలో సూర్యకాంతితో ప్రకాశిస్తాయి.
కచ్చితంగా 12 గంటలు పగలు.. 12 గంటలు రాత్రి ఉండదా?
చాలామంది విషువత్తు రోజున పగలు, రాత్రి కచ్చితంగా 12 గంటల చొప్పున ఉంటాయని భావిస్తారు. కానీ వాస్తవానికి పగటి సమయం రాత్రి కంటే కొద్ది నిమిషాలు ఎక్కువగా ఉంటుంది..
సూర్యుడు ఒక బిందువు కాదు, భారీ గోళం. ఉదయించేటప్పుడు, అస్తమించేటప్పుడు సూర్యుని అంచుల నుంచి వచ్చే కాంతిని భూ వాతావరణం వంచుతుంది. దీనివల్ల సూర్యుడు క్షితిజంపైకి రాకముందే వెలుతురు కనిపిస్తుంది, అస్తమించిన తర్వాత కూడా కాసేపు వెలుతురు ఉంటుంది.
ఉదాహరణకు..
ఢిల్లీలో సెప్టెంబర్ 23న ఉదయం 6:09 గంటలకు సూర్యోదయం కాగా, సాయంత్రం 6:16 గంటలకు సూర్యాస్తమయం అవుతుంది. అంటే అక్కడ పగటి సమయం దాదాపు 12 గంటల 7 నిమిషాలు ఉంటుంది. ప్రాంతాల అక్షాంశాలను బట్టి దేశంలోని వివిధ నగరాల్లో కొన్ని నిమిషాల స్వల్ప తేడాలుంటాయి.
ఋతువుల మార్పుకు నాంది – తర్వాతి ఖగోళ ఘట్టం..
సెప్టెంబర్ ఈక్వినాక్స్ను ‘సౌత్వర్డ్ ఈక్వినాక్స్’ అని కూడా అంటారు. దీని తర్వాత సూర్యుడు దక్షిణార్ధగోళం వైపు కదులుతాడు. దీంతో భారతదేశం ఉన్న ఉత్తరార్ధగోళంలో పగటి సమయం క్రమంగా తగ్గుతూ, రాత్రి సమయం పెరుగుతుంది. ఇది శరదృతువు (Autumn), ఆపై చలికాలం రాకను సూచిస్తుంది. ఇదే సమయంలో ఆస్ట్రేలియా వంటి దక్షిణార్ధగోళ దేశాల్లో ఎండలు పెరిగి వసంత రుతువు (Spring) ప్రారంభమవుతుంది.
తర్వాతి ఘట్టం ‘వింటర్ సోల్స్టిస్’
సెప్టెంబర్ ఈక్వినాక్స్ తర్వాత జరిగే తదుపరి ప్రధాన ఖగోళ పరిణామం ‘డిసెంబర్ సోల్స్టిస్’. 2026 డిసెంబర్ 22న ఇది సంభవించనుంది. ఆ రోజున ఉత్తరార్ధగోళంలో సంవత్సరంలోనే అత్యంత చిన్న పగలు, సుదీర్ఘమైన రాత్రి ఏర్పడతాయి.
