Medico Priyanka

Medico Priyanka: ముగిసిన మెడికో ప్రియాంక పోస్టుమార్టం.. కన్నీటిసంద్రంలో స్వగ్రామానికి భౌతికకాయం.. సాయంత్రం అంత్యక్రియలు!

Medico Priyanka: రాజమహేంద్రవరంలో మద్యం మత్తులో కొందరు యువకులు కారుతో నిర్లక్ష్యంగా ఢీకొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూసిన వైద్య విద్యార్థిని ప్రియాంక (28) మృతదేహానికి హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం వైద్యులు భౌతికకాయాన్ని కన్నీరుమున్నీరవుతున్న ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు.

పోస్టుమార్టం ప్రక్రియ ముగిసిన వెంటనే ప్రియాంక భౌతికకాయాన్ని ఆమె స్వస్థలమైన జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం ఎక్లాస్‌పూర్‌కు అంబులెన్స్‌లో తరలించనున్నారు. సోమవారం సాయంత్రం ఎక్లాస్‌పూర్‌లో ప్రియాంక అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఆసుపత్రి వద్ద విలపించిన తండ్రి.. ఓదార్చిన నేతలు!
డాక్టర్‌గా సమాజానికి సేవలందించాల్సిన కూతురు ఇలా శవమై కనిపిస్తుండటంతో గాంధీ ఆసుపత్రి వద్ద ప్రియాంక తండ్రి రోదనలు అక్కడున్న వారిని తీవ్రంగా కలచివేశాయి.
గాంధీ ఆసుపత్రి వద్దకు చేరుకున్న తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి, రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే శ్రీనివాస్.. ప్రియాంక తండ్రిని పరామర్శించి ఓదార్చారు. ఈ కష్ట సమయంలో కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రియాంక మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లే క్రమంలో రాజమహేంద్రవరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెంకట రమణా చౌదరి స్వయంగా అంబులెన్స్ వెంట వెళ్లనున్నారు.
స్వగ్రామంలో రూ. 20 లక్షల పరిహార చెక్ అందజేత!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించిన ₹20 లక్షల పరిహారానికి సంబంధించిన చెక్‌ను అందించేందుకు ఏపీ మంత్రి టీజీ భరత్ స్వయంగా ఎక్లాస్‌పూర్ గ్రామానికి వెళ్లనున్నారు. ప్రియాంక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, నిందితులకు కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చట్టపరమైన చర్యలు వేగవంతం చేశామని అధికారులు వెల్లడించారు. ఎంతో ప్రయోజకురాలవుతుందనుకున్న కూతురు అర్ధాంతరంగా నిష్క్రమించడంతో ఎక్లాస్‌పూర్ గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *