delhi high court

Jantar Mantar: జంతర్ మంతర్ వద్ద నిరసనలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు!

Jantar Mantar: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనల నిర్వహణపై ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) కీలక వ్యాఖ్యలు చేసింది. నగరం నడిబొడ్డున ప్రతి చిన్న విషయానికి ధర్నాలు, నిరసనలు చేపట్టడం వల్ల సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వ్యాఖ్యానించింది.

“వ్యక్తిగతంగా చెప్పాలంటే.. నగరంలో ఇలాంటి నిరసనలు జరగకూడదనేది నా అభిప్రాయం. దానికోసం మొత్తం ఢిల్లీ నగరాన్నే బందీగా మార్చడం సరికాదు. అయితే దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే” అని జస్టిస్ అమిత్ మహాజన్ స్పష్టం చేశారు.
అసలు కేసేంటి?
దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల (SC) జాబితాలో చేర్చాలని డిమాండ్ చేస్తూ ‘ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ’ (AIDCRPC) ఆగస్టు 10న జంతర్ మంతర్ వద్ద ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కేవలం 75 మందితో శాంతియుత నిరసన తెలిపేందుకు అనుమతి కోరింది. జూలై 9న దరఖాస్తు చేసుకున్నప్పటికీ పోలీసులు ఎలాంటి స్పందనా ఇవ్వకపోవడంతో ఆ కమిటీ హైకోర్టును ఆశ్రయించింది.
శనివారంలోగా నిర్ణయం తీసుకోవాలని పోలీసులకు ఆదేశం
ఈ విచారణ సందర్భంగా కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ కోర్టుకు పలు విషయాలను వివరించారు..
  • భద్రతా కారణాలు: రాబోయే స్వాతంత్ర్య దినోత్సవ (ఆగస్టు 15) భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా నగరంలో నిషేధాజ్ఞలు (Section 163 BNSS) అమలులో ఉన్నాయని తెలిపారు.
  • సుప్రీంకోర్టులో కేసు: అసలు జంతర్ మంతర్‌ను నిరసనల ప్రాంతంగా ఉంచాలా వద్దా అనే అంశంపై సుప్రీంకోర్టులో కూడా ఒక పిల్ (PIL) విచారణలో ఉందని కోర్టుకు స్పష్టం చేశారు.
  • పోలీసుల పరిధి: 75 మంది అని చెప్పినప్పటికీ నిరసనల్లో జనాలు ఎంతమంది పెరుగుతారో అంచనా వేయలేమని, పిటిషనర్ దరఖాస్తుపై పరిశీలించి శనివారంలోగా (ఆగస్టు 8) పోలీసుల నిర్ణయాన్ని కమిటీకి తెలియజేస్తామని హామీ ఇచ్చారు.

శాంతిభద్రతల నిర్వహణ అనేది పూర్తిగా పోలీసుల పరిధిలోని అంశమని, నిరసనల అనుమతిపై తాము నేరుగా ఆదేశాలు ఇవ్వలేమని పేర్కొంటూ ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్‌ను ముగించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *