Tammineni: రూ. 4 కోట్ల విలువైన ల్యాండ్ కబ్జా వివాదంలో చిక్కుకున్న ఏపీ మాజీ స్పీకర్, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు తమ్మినేని సీతారాం ఎట్టకేలకు శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు.
ఈ కేసు వివరాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. బతికున్న భూ యజమానిని చనిపోయినట్లు నకిలీ కాగితాలు సృష్టించి, ఒడిశాకు చెందిన ఒక మహిళను ఏకైక వారసురాలిగా చూపిస్తూ ఈ భారీ భూకబ్జాకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో తమ్మినేని సీతారాంతో పాటు ఆయన భార్య వాణిశ్రీ, కుమారుడు వెంకట శ్రీరామ్ చిరంజీవి నాగ్ నిందితులుగా ఉన్నారు. ఈ కబ్జా వ్యవహారం బయటపడటంతో తమ్మినేని కుటుంబం సొంత కార్లను వదిలేసి, ప్రైవేటు ఇన్నోవా కారులో రహస్యంగా పరారవ్వడం అప్పట్లో తీవ్ర కలకలం రేపింది.
అయితే, ఇటీవల ఈ కేసు హైకోర్టుకు చేరింది. అరెస్ట్ కాకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని తమ్మినేని తనయుడు నాగ్ వేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది. ప్రస్తుతం ఆయన పరారీలోనే ఉన్నారు. మరోవైపు, తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణిశ్రీకి కోర్టు షరతులతో కూడిన తాత్కాలిక ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
న్యాయస్థానం ఆదేశాల మేరకు తమ్మినేని బుధవారం ఉదయం 10 గంటలకు విచారణాధికారి ముందరకు వచ్చారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. దర్యాప్తునకు సరిగ్గా సహకరించకపోతే బెయిల్ రద్దు చేస్తామని కోర్టు స్పష్టం చేయడంతో తమ్మినేని విచారణకు హాజరుకాక తప్పలేదు. ఈ ప్రధాన బెయిల్ పిటిషన్పై తదుపరి విచారణను హైకోర్టు ఆగస్టు 17కు వాయిదా వేసింది.
