Odisha

Odisha: ఒడిశాలో తీవ్ర విషాదం.. సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఆరుగురు కార్మికులు మృతి!

Odisha: ఒడిశాలో అత్యంత విషాదకరమైన సంఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న ఒక సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగిన ఆరుగురు కూలీలు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. మరో కూలీ పరిస్థితి ప్రస్తుతం చాలా విషమంగా ఉంది. ఈ ఘోర ప్రమాదంపై ఒడిశా ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం తరపున రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఒడిశా ముఖ్యమంత్రి ప్రకటించారు.

ఈ ప్రమాదం ఒడిశాలోని కలహండి జిల్లా, మదన్‌పూర్ ప్రాంతంలోని గౌడ కర్లఖుంట అనే గ్రామంలో చోటుచేసుకుంది. అక్కడ ఒక కొత్త సెప్టిక్ ట్యాంక్ నిర్మాణం జరుగుతోంది. దానికి వేసిన సెంట్రింగ్ తొలగించడానికి ఒక మేస్త్రీ మొదట ట్యాంక్‌లోకి దిగాడు. అయితే, దురదృష్టవశాత్తూ అతడు అందులోనే పడిపోయాడు. లోపల ఉన్న ప్రమాదకరమైన గ్యాస్ వల్ల అతనికి ఊపిరాడలేదు. అతడిని ఎలాగైనా కాపాడాలనే ఆరాటంతో ఒకరి వెనుక ఒకరుగా మరో ఐదుగురు కూలీలు ట్యాంక్‌లోకి దిగారు. కానీ, లోపల ఉన్న విషవాయువుల తీవ్రతకు అందరూ అక్కడికక్కడే ఊపిరాడక ప్రాణాలు విడిచారు.

ఈ ప్రమాదంలో మరణించిన వారి వివరాలను పోలీసులు సేకరించారు. మృతులలో గౌడ్ కార్లఖుంట గ్రామానికి చెందిన టాయిలెట్ మేస్త్రీ నిమయన్ పాల్ (48), అతని కుమారుడు ఆకాష్ పాల్ (28) ఉన్నారు. వీరితో పాటు అదల్ మాఝీ (55), మాతోగండ గ్రామానికి చెందిన మైనోరంజాద్ హతి (27), దుతగాన్ ప్రాంతానికి చెందిన చందా జల్, బిపుల్ జల్ అనే కూలీలు కూడా ఈ విషాదంలో కన్నుమూశారు. తండ్రీకొడుకులు ఇద్దరూ ఒకేసారి చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇదే ఘటనలో హతిఖోజ్ గ్రామానికి చెందిన పంకజ్ యాని (32) అనే మరో కూలీ తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని వెంటనే దగ్గరలోని ఎం రాంపూర్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో, మెరుగైన వైద్యం కోసం జిల్లా ప్రధాన ఆసుపత్రికి చేర్చారు. ప్రస్తుతం అతని ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరినీ తీవ్రంగా కలచివేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *