Kavitha

Kavitha: భూ నిర్వాసితుల పక్షాన గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించిన కవిత

Kavitha: ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్లు, భూములు కోల్పోయిన బాధితులకు వెంటనే న్యాయం చేయాలని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె బాధితులతో కలిసి లోక్‌భవన్‌లో గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లాను కలిశారు. వెలుగుమట్ల నిర్వాసితులతో పాటు వికారాబాద్‌ జిల్లా కడ్లాపూర్‌ గ్రామస్థులు, రీజినల్ రింగ్ రోడ్డు బాధితుల సమస్యలను కూడా గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, బాధితులందరికీ న్యాయం జరిగేలా చూడాలని గవర్నర్‌కు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు.

వెలుగుమట్లలో ఇళ్లు కోల్పోయి రోడ్డున పడ్డ పేద కుటుంబాలందరికీ ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలాలు కేటాయించాలని కవిత కోరారు. అలాగే, వికారాబాద్ జిల్లా కడ్లాపూర్‌లో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు పేరుతో ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటీసులను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణం కోసం రైతుల నుంచి సేకరిస్తున్న భూముల విషయంలో అలైన్‌మెంట్ మార్చాలని, నష్టపోతున్న రైతులకు సరైన న్యాయం చేయాలని ఈ సందర్భంగా గవర్నర్‌ను కోరినట్లు వివరించారు.

ప్రభుత్వ నిర్ణయాల వల్ల భూములు, ఇళ్లు కోల్పోయి సామాన్య ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుల పక్షాన తాము చేస్తున్న ఈ పోరాటానికి గవర్నర్ సానుకూలంగా స్పందించారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించి బాధితులకు తగిన న్యాయం చేయకపోతే, భవిష్యత్తులో ప్రజలందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తామని, మళ్లీ పోరాట బాట పడతామని కవిత హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *