Don 3 Dispute

Don 3 Dispute: ‘డాన్ 3’ వివాదంతో హీరోల అడ్వాన్సుల రగడ.. నిర్మాతల్లో మొదలైన కొత్త టెన్షన్!

Don 3 Dispute: సినీ పరిశ్రమలో హీరోల కాల్‌షీట్లు, వారు తీసుకునే అడ్వాన్సులు, ఇచ్చిన మాట తప్పడం వంటి విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ చుట్టూ తిరుగుతున్న ‘డాన్ 3’ సినిమా వివాదం ఇప్పుడు చిత్ర పరిశ్రమ మొత్తానికి ఒక పెద్ద హెచ్చరికలా కనిపిస్తోంది. పెద్ద ప్రాజెక్టులకు ఓకే చెప్పి, ఆ తర్వాత వెనక్కి తగ్గితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ సంఘటన చూపిస్తోందని సినీ వర్గాలు అంటున్నాయి.

అసలు ఏం జరిగిందంటే.. రణ్‌వీర్ సింగ్ ‘డాన్ 3’ సినిమా చేయడానికి ఒప్పుకుని, భారీ మొత్తంలో అడ్వాన్స్ కూడా తీసుకున్నట్లు సమాచారం. అయితే, ఆ తర్వాత ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడనే ప్రచారం బాలీవుడ్‌లో గట్టిగా నడుస్తోంది. దీనివల్ల నష్టపోయిన నిర్మాతలు ఆయన నుండి దాదాపు రూ. 45 కోట్ల నష్టపరిహారం డిమాండ్ చేస్తున్నారని, ఒకవేళ సర్దుబాటు కుదరకపోతే ఆయనపై బ్యాన్ విధించే వరకు వెళ్లవచ్చని ముంబై సినీ వర్గాల్లో గట్టి టాక్ వినిపిస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు బాలీవుడ్‌ను కుదిపేస్తోంది.

అయితే ఈ సమస్య ఒక్క రణ్‌వీర్ సింగ్‌తోనే ఆగిపోలేదు. చాలా మంది హీరోలు అడ్వాన్సులు తీసేసుకుని, కథలు కూడా ఓకే చేసి, ఆ తర్వాత నిర్మాతలను ఏళ్ల తరబడి వేచి చూసేలా చేస్తున్నారనే అసంతృప్తి ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉంది. హీరోల డేట్స్ దొరక్క, పెట్టిన పెట్టుబడికి వడ్డీలు కట్టలేక నిర్మాతలు లోలోపల నలిగిపోతున్నారు. హీరోలు ఒక ప్రాజెక్ట్ మధ్యలో ఉండగానే మరో సినిమాకు సైన్ చేయడం వల్ల పాత సినిమాలు ఆగిపోతున్న సందర్భాలు కూడా ఉన్నాయి.

మన టాలీవుడ్ లో కూడా నిర్మాతల పరిస్థితి దాదాపు ఇలాగే ఉంది. ఇక్కడ నిర్మాతలు హీరోలపై ఉన్న నమ్మకంతో కోట్ల రూపాయల అడ్వాన్సులు ముందుగానే ఇచ్చేస్తుంటారు. ఆ తర్వాత సదరు హీరోల డేట్స్ కోసం, వారు ఎప్పుడు ఖాళీ అవుతారా అని సంవత్సరాల తరబడి కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. కానీ ‘డాన్ 3’ వివాదం తర్వాత ఇప్పుడు టాలీవుడ్‌లోనూ పరిస్థితులు మారుతున్నాయి. నిర్మాతలు కూడా ఇకపై హీరోల విషయంలో కఠినంగా వ్యవహరించాలని, లీగల్ అగ్రిమెంట్లు పక్కాగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *