TVK Vijay: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ సంచలన విజయం సాధించింది. మొత్తం 234 స్థానాలకు గాను ఏకంగా 108 చోట్ల గెలుపొంది, రాష్ట్రంలోనే అతిపెద్ద రాజకీయ శక్తిగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌కు కేవలం 10 స్థానాల దూరంలో నిలిచినప్పటికీ, పలు చిన్న పార్టీలు విజయ్‌కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తమిళనాట కొత్త రాజకీయ శకం మొదలైనట్లు కనిపిస్తోంది.
తాజాగా చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా విజయ్ను తమ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయనపై ఎమ్మెల్యేలు పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తుందని ఈ సమావేశంలో తీర్మానించారు.
మరోవైపు, ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ప్రస్తుత ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తన పదవికి రాజీనామా చేయగా, గవర్నర్ దానిని ఆమోదించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమను ఆహ్వానించాలని కోరుతూ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌కు విజయ్ లేఖ రాశారు. ఈమెయిల్ ద్వారా పంపిన ఈ లేఖలో, రెండు వారాల్లోగా అసెంబ్లీలో తమ మెజారిటీని నిరూపించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం గవర్నర్ అందుబాటులో లేనందున, బుధవారం ఆయనను విజయ్ నేరుగా కలిసే అవకాశం ఉంది.
ఇక విజయ్ ఈ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించారు. పెరంబూరులో లక్షా 20 వేల పైచిలుకు ఓట్ల భారీ మెజారిటీతో, తిరుచిరాపల్లి తూర్పులో 27 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. అయితే ఒకే వ్యక్తి రెండు సీట్లలో ఉండకూడదు కాబట్టి, భారీ మెజారిటీ వచ్చిన పెరంబూరు సీటును ఉంచుకుని, తిరుచిరాపల్లి తూర్పు స్థానానికి రాజీనామా చేయాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి సరికొత్త పాలనకు శ్రీకారం చుట్టబోతున్నారు.
