Crime News: హైదరాబాద్ నగరంలో న్యూ ఇయర్ వేడుకలు దగ్గరపడుతుండటంతో పోలీసులు నిఘా పెంచారు. సాధారణంగా ప్రతి ఏటా డిసెంబరు, జనవరి నెలల్లోనే డ్రగ్స్ వ్యాపారం భారీగా జరుగుతుంటుందని గణాంకాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, రాష్ట్రంలో మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా తాజాగా ‘ఈగల్ టీమ్’ పోలీసులు ఆరుగురు డ్రగ్ పెడ్లర్లను పట్టుకొని అరెస్ట్ చేశారు.
నిందితుల నుంచి పోలీసులు భారీగా మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. వారి వద్ద 330 గ్రాముల గంజాయితో పాటు, అత్యంత ఖరీదైన 3 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండీఎంఏ దొరికినట్లు అధికారులు వెల్లడించారు. పట్టుబడిన వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రహస్యంగా గంజాయిని రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాగా పోలీసులు గుర్తించారు.
జిల్లాల వారీగా చూస్తే.. వరంగల్ జిల్లాలో ముగ్గురు గంజాయి విక్రేతలను అరెస్ట్ చేసి వారి నుంచి 80 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిపిన తనిఖీల్లో మరో 250 గ్రాముల గంజాయి పట్టుబడింది. యువత మత్తుకు బానిస కాకుండా ఉండేందుకు, డ్రగ్స్ నెట్వర్క్ను పూర్తిగా తుడిచిపెట్టేందుకు పోలీసులు గాలింపు చర్యలు మరింత వేగవంతం చేశారు.

