India T20 World Cup 2026 Squad: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. 2026 టీ20 ప్రపంచకప్ సమరానికి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 7 నుంచి 20 జట్ల మధ్య జరగనున్న ఈ మెగా టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్ బరిలోకి దిగుతోంది. టైటిల్‌ను నిలబెట్టుకునే క్రమంలో టీమ్ ఇండియా వేయబోయే తొలి అడుగు ‘జట్టు ఎంపిక’.
ముంబై వేదికగా సెలక్షన్ కమిటీ భేటీ
ఈరోజు (డిసెంబర్ 20, శనివారం) మధ్యాహ్నం 1:30 గంటలకు ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయం నుంచి భారత 15 మంది సభ్యుల జట్టును అధికారికంగా ప్రకటించనున్నారు. జాతీయ సెలెక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటారు.
లైవ్ ఎక్కడ చూడొచ్చు? ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అలాగే జియో హాట్‌స్టార్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా వీక్షించవచ్చు.
గిల్ ఫామ్.. సెలక్టర్లకు పెద్ద తలనొప్పి!
ప్రస్తుతం టీమ్ ఇండియా ముందున్న అతిపెద్ద ప్రశ్న.. ఓపెనింగ్ జోడీ ఎవరు? వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత శుభ్‌మన్ గిల్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
ఇది కూడా చదవండి: Bharat Future City: సింగపూర్ ప్లాన్.. ముచ్చర్ల రేంజ్: ప్రపంచ పటంలో మెరవనున్న ‘హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ’!
గత కొన్ని మ్యాచ్‌ల్లో గిల్ కనీసం ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయలేకపోయాడు.మరోవైపు దక్షిణాఫ్రికా సిరీస్‌లో కాలి గాయంతో గిల్ దూరమైనప్పుడు, ఓపెనర్‌గా వచ్చిన సంజూ శాంసన్ వేగంగా ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు. అభిషేక్ శర్మ విధ్వంసకర ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో.. అతనికి జోడీగా గిల్ కంటే శాంసన్ అయితేనే ‘పవర్ ప్లే’ని సమర్థవంతంగా వాడుకోగలరనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మార్పులు ఉంటాయా? పాత జట్టునే కొనసాగిస్తారా?
దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన 15 మంది సభ్యుల జట్టులో పెద్దగా మార్పులు ఉండే అవకాశం లేదని సమాచారం. సీనియర్ల గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని కుర్రాళ్లే వరల్డ్ కప్‌లోనూ సత్తా చాటాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే బ్యాకప్ ఓపెనర్ లేదా అదనపు స్పిన్నర్ విషయంలో ఏమైనా సర్ప్రైజ్ నిర్ణయాలు ఉంటాయా అనేది ఆసక్తికరంగా మారింది.
భారత్ ఆశలు.. సూర్య సారథ్యం
రోహిత్ శర్మ నిష్క్రమణ తర్వాత టీ20 బాధ్యతలు చేపట్టిన సూర్యకుమార్ యాదవ్‌కు ఇది అతిపెద్ద పరీక్ష. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్, మళ్లీ ట్రోఫీని ముద్దాడాలంటే సరైన కాంబినేషన్ ఎంపిక అత్యంత కీలకం.

