Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బుధవారం దంతెవాడ జిల్లాలో ఏకంగా 71 మంది మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ లొంగుబాటులో 50 మంది పురుషులు, 21 మంది మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. వీరిలో 30 మందిపై మొత్తం రూ. 64 లక్షల రివార్డు కూడా ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వ వ్యూహంతో తగ్గుతున్న నక్సల్స్ కార్యకలాపాలు
మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలను ప్రభుత్వం ముమ్మరం చేయడం, వారికి పునరావాసం కల్పించే విధానాలను పటిష్టంగా అమలు చేయడం వల్ల నక్సల్స్ కార్యకలాపాలు బాగా తగ్గిపోయాయని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ వల్ల మావోయిస్టులకు భారీగా నష్టం వాటిల్లుతోందని, అందుకే లొంగిపోవడం తప్ప వారికి మరో దారి లేదని ఆయన అన్నారు.
జనజీవన స్రవంతిలో కలిసే వారికి ఉపాధి
లొంగిపోయిన మావోయిస్టులు గతంలో ఎన్నో హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నారని బస్తర్ ఐజీ చెప్పారు. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి పునరావాసం కల్పిస్తామని, హింసను వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసే వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని స్థానిక అధికారులు హామీ ఇచ్చారు. మావోయిస్టులు హింసను వదిలిపెట్టి సాధారణ జీవితం గడపడమే తమ లక్ష్యమని అధికారులు స్పష్టం చేశారు.

