Early Salary Credit: కేరళలో ఓనం పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను ఆగస్టు 27న విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. సాధారణంగా వేతనాలను నెల చివరి పని దినంనాడు విడుదల చేస్తారు. అయితే, ఓనం పండుగ వల్ల ఉద్యోగులకు ఆర్థికంగా సహాయపడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే మహారాష్ట్రలో గణేష్ చతుర్థి పండుగ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా జీతాలను ముందస్తుగా ఆగస్టు 27న విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఈ ఆదేశాల ద్వారా మహారాష్ట్రలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, కార్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఈ నిర్ణయం వల్ల ఉద్యోగులు పండుగ అవసరాలకు, ఖర్చులకు ముందుగానే డబ్బు అందుబాటులో ఉండటంతో సహాయపడుతుంది. సాధారణంగా ఇలాంటి పండుగల సమయంలో ఉద్యోగులకు ఆర్థికంగా ఆసరాగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం ఇలాంటి ముందస్తు జీతాల చెల్లింపులను అనుమతిస్తుంది. ఈ ఏడాది కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఈ నిర్ణయాలను తీసుకుంది.
ఇది కూడా చదవండి: Nalgonda: అత్యాచారం కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. 51 ఏళ్ల జైలు శిక్ష
కాగా మహారాష్ట్రలో గణేష్ చతుర్థి పండుగ అత్యంత వైభవంగా, ఘనంగా జరుపుకునే పండుగలలో ఒకటి. గణేష్ చతుర్థి పండుగకు మహారాష్ట్రలో సుదీర్ఘ చరిత్ర ఉంది. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ కాలం నుంచి ఈ ఉత్సవాలను జరుపుకునే ఆనవాయితీ ఉంది. అయితే, ఈ పండుగను జాతీయ స్థాయిలో ఒక సామూహిక వేడుకగా మార్చిన ఘనత స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య బాలగంగాధర్ తిలక్‌కు దక్కుతుంది. మహారాష్ట్రలో గణేష్ చతుర్థి వేడుకలు 10 రోజుల పాటు జరుగుతాయి. భాద్రపద మాసం శుక్ల చతుర్థి రోజున ప్రారంభమై, అనంత చతుర్దశి నాడు ముగుస్తాయి. కేరళ రాష్ట్రంలో ఓనం పండుగను అత్యంత వైభవంగా, పది రోజుల పాటు జరుపుకుంటారు. ఇది కేరళలోని ప్రజలకు ఒక ముఖ్యమైన పంటల పండుగ. ఇది మలయాళ క్యాలెండర్ ప్రకారం మొదటి నెల అయిన ‘చింగం’ (ఆగస్టు-సెప్టెంబర్)లో వస్తుంది.