Congo

Congo: కాంగో కాపర్ గనిలో ఘోరం: వంతెన కూలి 32 మంది మృతి!

Congo: డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (DRC) లోని లువాలాబా ప్రావిన్స్‌లో ఉన్న ఒక రాగి (కాపర్) గని వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో కనీసం 32 మంది కార్మికులు మరణించారు. గని ప్రాంతంలోని ఒక తాత్కాలిక వంతెన కుప్పకూలడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ప్రాంతీయ అంతర్గత వ్యవహారాల మంత్రి రాయ్ కౌంబా మయోండే ధృవీకరించిన వివరాల ప్రకారం, ఈ ఘటనలో కనీసం 32 మృతదేహాలను వెలికితీశారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించినా, చట్టవిరుద్ధంగా తవ్వకాలు జరిపే కార్మికులు ఆ ప్రదేశంలోకి బలవంతంగా ప్రవేశించారు. వరదలు వచ్చిన ప్రాంతాన్ని దాటడానికి నిర్మించిన ఈ తాత్కాలిక వంతెనపై అధిక సంఖ్యలో కార్మికులు ఒకేసారి గుమిగూడటం లేదా సైనికుల కాల్పులతో భయభ్రాంతులకు గురై ఒక్కసారిగా పరుగెత్తడం వల్ల వంతెన బరువును తట్టుకోలేక కుప్పకూలిందని అధికారులు ప్రాథమికంగా తెలిపారు.

ఇది కూడా చదవండి: Nitish Kumar: బీహార్ రాజకీయాల్లో రికార్డు.. 10వ సారి సీఎంగా నితీశ్ కుమార్

“భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్నందున సైట్‌లోకి ప్రవేశించడంపై నిషేధం ఉన్నప్పటికీ, అక్రమ తవ్వకాల కార్మికులు బలవంతంగా క్వారీలోకి ప్రవేశించారు,” అని రాయ్ కౌంబా మయోండే విలేకరులకు తెలిపారు. కాంగో ప్రపంచంలోనే అతిపెద్ద కోబాల్ట్ ఉత్పత్తిదారుగా ఉంది. ఇక్కడ అక్రమ తవ్వకాలు, ప్రమాదకర పరిస్థితులు, బాలకార్మికుల వినియోగం వంటి ఆరోపణలు తరచుగా వినిపిస్తుంటాయి. ఈ కలాండో గని వద్ద కూడా అక్రమ కార్మికులు, సహకార సంఘాలు, చట్టబద్ధమైన ఆపరేటర్ల మధ్య చాలా కాలంగా వివాదం నడుస్తోంది.

ఈ ఘటనతో అధికార యంత్రాంగం వెంటనే ఆ ప్రాంతంలో గని కార్యకలాపాలను నిలిపివేసింది. ఈ దుర్ఘటనపై మరింత లోతైన దర్యాప్తు జరిపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కాంగోలోని చాలా మంది ప్రజలకు ఈ రాగి మైనింగ్‌ జీవనాధారం. కనీసం 15-20 లక్షల మంది ఈ గని ద్వారా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా లక్షలాది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. కనీస భద్రతా చర్యలు లేకపోవడంతో గతంలో ఈ గనిలో ప్రమాదాలు జరిగి చాలా మంది మృతిచెందారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *