COVID Cases In India: దేశవ్యాప్తంగా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న విషయం ఆందోళన కలిగిస్తోంది. శనివారం ఒక్కరోజే మహారాష్ట్ర, కర్ణాటకల్లో ఇద్దరు కరోనా బాధితులు మృతి చెందారు. అలాగే పలు రాష్ట్రాల్లో కేసులు వేగంగా పెరుగుతుండటంతో ప్రజలలో భయాందోళనలు వెల్లివిరుస్తున్నాయి. తాజా సమాచారం మేరకు, కొవిడ్-19కు చెందిన రెండు కొత్త సబ్ వేరియంట్లు — NB.1.8.1, LF.7 — భారత్‌లో వెలుగుచూశాయని ఇండియన్ సార్స్ కరోనా వైరస్-2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది.
మృతుల వివరాలు
మహారాష్ట్ర ఠాణెలో 21 ఏళ్ల యువకుడు, బెంగళూరులో 84 ఏళ్ల వృద్ధుడు కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇద్దరికీ ముందు నుంచే అనారోగ్య సమస్యలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
పెరుగుతున్న రాష్ట్రాల వారీగా కేసులు
కేరళలో మే నెలలో ఇప్పటివరకు అత్యధికంగా 273 కేసులు నమోదవగా, ఢిల్లీలో 23, తమిళనాడులో, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లోనూ కొత్త కేసులు వెలుగుచూశాయి. కడప రిమ్స్‌లో ఒక వృద్ధురాలికి కరోనా సోకినట్టు నిర్ధారించారు. ఆమె ప్రస్తుతం చికిత్స పొందుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి
ఆంధ్రప్రదేశ్‌లో 4, తెలంగాణలో 1 కొత్త కేసు నమోదైంది. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తూ ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేసింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Hyderabad: తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు – వాతావరణ శాఖ హెచ్చరిక
కొత్త వేరియంట్లు – జాగ్రత్త అవసరం
NB.1.8.1 వేరియంట్ తమిళనాడులో ఏప్రిల్‌లో గుర్తించగా, LF.7 వేరియంట్‌కు చెందిన నాలుగు కేసులు గుజరాత్‌లో మేలో నమోదయ్యాయి. చైనా సహా ఆసియా దేశాల్లో కరోనా మళ్లీ వ్యాపిస్తున్నదానికి ఈ వేరియంట్లే ప్రధాన కారణమని INSACOG వెల్లడించింది. ఈ వేరియంట్లపై నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నామని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
కేంద్రం సమీక్ష
దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసులపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో తీవ్రత తక్కువగా ఉందని, చాలా మంది హోమ్ క్వారంటైన్‌లోనే చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.
జాగ్రత్తలు తీసుకోవాలి:
-
జనం గుమిగూడే ప్రదేశాల్లో మాస్క్ ధరించండి
-
చేతులను తరచూ శుభ్రంగా కడుక్కోవాలి
-
కోవిడ్ లక్షణాలు ఉన్నవారు వెంటనే టెస్టు చేయించుకోవాలి
-
స్వీయ నిర్బంధంలో ఉండాలి.