2024 Rewind: తెలుగు సినిమా జాతీయస్థాయిలో మరోసారి విజయకేతనాన్ని ఎగరేసింది. ‘పుష్ప-2’ చిత్రం అంతర్జాతీయంగా 1700 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసి ఈ యేడాది భారతీయ చిత్రాలలో అగ్రస్థానంలో నిలిచింది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సినీజనాలకు ‘పుష్ప-2’ విజయం ఓ మరపురాని, మరువలేని తీపి గుర్తుగా మారబోతోంది. ‘పుష్ప-2’ విజయంతో 2024కు వీడ్కోలు పలికే ముందు… మొత్తంగా ఈ యేడాది టాలీవుడ్ చిత్రాలపై ఓ లుక్కేద్దాం.
ఈ యేడాది స్ట్రయిట్ తెలుగు సినిమాలు దాదాపు 250 విడుదల అయ్యాయి. అలానే అనువాద చిత్రాలు 60కు పైగా జనం ముందుకు వచ్చాయి. వెరశి సుమారు 310 సినిమాలు తెలుగువారిని పలకరించాయి. ‘పుష్ప-2’, ‘కల్కి’, ‘దేవర’, ‘గుంటూరు కారం’ చిత్రాలే కాదు… ‘హను-మాన్’, ‘టిల్లు స్క్వేర్’, ‘కమిటీ కుర్రోళ్ళు’, ‘ఆయ్’ లాంటి చిత్రాలూ విజయపథంలో సాగాయి. ఆ ముచ్చట్లు చూసేద్దాం.
ఇది కూడా చదవండి: Operation Smile: ఎమోషనల్ స్టోరీ.. 8 ఏళ్ల వయసులో మిస్సింగ్.. కట్ చేస్తే..
2024 Rewind: ఈ యేడాది ప్రధమార్థం చివరిలో చిన్న చిత్రాలకూ ప్రేక్షకులు పట్టం కట్టారు. హీరో వర్షిప్ లేని ‘కమిటీ కుర్రాళ్ళు’, ‘ఆయ్’ చిత్రాల విజయం దానికి తార్కాణం. అదే తరహా ఫలితాలను ఆశిస్తూ సినీ రంగం ద్వితీయార్థంలోకి ఆశగా అడుగులు వేసింది.
ఈ యేడాది స్ట్రయిట్ తెలుగు సినిమాలతో పాటు దాదాపు 60 డబ్బింగ్ సినిమాలూ తెలుగు వారిని పలకరించాయి. అయితే సొంత రాష్ట్రాలలో ఆడినట్టుగా తెలుగు స్టేట్స్ లో ఈ సినిమాలు సందడి చేయలేకపోయాయి. కొన్ని భారీ చిత్రాలు పరాజయం పాలైతే, మరికొన్ని సినిమాలు యావరేజ్ గా సాగాయి. వీటిలో ‘అమరన్’ మూవీ మాత్రం అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది.
2024లో భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు చిన్న చిత్రాలూ విజయాన్ని సాధించడం చెప్పుకోదగ్గది. కంటెంట్ ఉంటే కటౌట్ తో సంబంధం లేదని ఈ సినిమాలు నిరూపించాయి. ఇక సంక్రాంతికి రాబోతున్న స్టార్ హీరోల సినిమాలతో కొత్త సంవత్సరం శుభారంభాన్ని పలుకుతుందని ఆశిద్దాం.