2024 New Heroines: సిల్వర్ స్క్రీన్ పై మెరిసే రంగుల సీతాకోకచిలుకలు కథానాయికలు! స్టార్స్ సరసన నటించే ఛాన్స్ సహజంగా పాపులర్ హీరోయిన్లకే లభిస్తుంది. అయితే… తమ అందచందాలతో కొత్తనీరులా చిత్రసీమలోకి ప్రతి యేడాది కొంతమంది ప్రవేశిస్తుంటారు. అందులో తరంగంలా ఉవ్వెత్తున ఎగిసే వారు కొందరు… విరిగిన కెరటంలా పడిపోయేవారు ఇంకొందరు. మరి 2024లో అలా ఎగిసిన నవ తరంగాల గురించి తెలుసుకుందాం.
కొత్తవారి కోసం టాలీవుడ్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. అయితే… వాళ్ళు సినిమాలకు కొత్తవాళ్ళు కావాల్సిన అవసరం లేదు… పక్క చిత్రసీమలో పాపులర్ అయినా చాలు… మనోళ్ళు రెడ్ కార్పెట్ పరిచి, వెల్ కమ్ చెప్పేస్తారు. ఈ యేడాది కూడా అలా తొలిసారి తెలుగు చిత్రసీమలోకి అడుపెట్టిన వారు ఉన్నారు.
బాలీవుడ్ కుర్రాళ్ళ హార్ట్ త్రోబ్ దీపికా పదుకునే! పెళ్ళి చేసుకుని, మదర్ స్టేటస్ ను ఎంజాయ్ చేస్తున్నా అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. చిత్రం ఏమంటే దీపికా పదుకునే తెలుగు లోకి చాలా యేళ్ళ క్రితమే ఎంట్రీ ఇవ్వాల్సింది. జయంత్ సి పర్జాన్జీ దర్శకత్వం వహించిన ‘లవ్ 4 ఎవర్’ మూవీలో ఓ స్పెషల్ సాంగ్ లో దీపికా నర్తించింది. కానీ ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. మళ్ళీ ఇంతకాలానికి ఆమెకు తెలుగులో నటించే ఛాన్స్ దక్కింది. లేదా… ఇప్పటికి ఆమె తెలుగు ప్రేక్షకులను కనికరించిందని అనుకోవాలి. సుప్రసిద్థ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మితమైన ‘కల్కి 2898 ఎ.డి.’తో దీపికా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాలో దీపికా పదుకునేది కీలక పాత్రే కానీ నాయిక పాత్ర కాదు. అయినా తనదైన నటనతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుని, ఆ సినిమా ఘన విజయంలో తనదీ కీలక పాత్ర అని నిరూపించుకుంది. ఆ తర్వాత మరే తెలుగు సినిమా అంగీకరించకపోయినా… ‘కల్కి’ రెండో భాగంలోనూ ఆమె భాగస్వామి కావాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: 2024 Celebrities Marriages: ఇయర్ మ్యారేజ్ చేసుకున్న సినీ సెలబ్రిటీలు వీళ్లే..
2024 New Heroines: దక్షిణాది చిత్రాలతో గ్రాండ్ సక్సెస్ ను అందుకుని, ఆ పైన బాలీవుడ్ బాట పట్టి అక్కడ మహారాణిగా భాసిల్లింది శ్రీదేవి. అయినా ఆమెకు దక్షిణాది చిత్రాలన్నా… ముఖ్యంగా తెలుగు సినిమాలన్నా ఎంతో ఇష్టం. తన కూతురు జాన్వీ కపూర్ ను టాలీవుడ్ లో హీరోయిన్ గా చూడాలని కలలు కంది శ్రీదేవి. కానీ ఆమె అకాల మరణంతో అది సాధ్యం కాలేదు. తల్లి చనిపోయిన కొంతకాలానికే జాన్వీ కపూర్ ఆమె కోరికను తీర్చుతూ ‘దేవర’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. దీనికి ముందు పలువురు స్టార్ హీరోలతో ఆమె నటించబోతోందనే ప్రచారం జరిగినా… అవన్నీ వార్తలకే పరిమితం అయిపోయాయి. చిత్రం ఏమంటే.. ‘దేవర’ సినిమా కూడా రెండు భాగాలుగా రాబోతోంది. సో… దీని సీక్వెల్ లోనూ ఆమె కథానాయిక. అయితే… ఇంతలోనే రామ్ చరణ్ తో సానా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామాలోనూ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.
బాలీవుడ్ నాయిక మానుషీ చిల్లర్ ఆచితూచి సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. మోడల్ గా మంచి గుర్తింపు ఉన్న ఆమె ఈ యేడాది టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా తెలుగు, హిందీ భాషల్లో రూపుదిద్దుకున్న ‘ఆపరేషన్ వాలెంటైన్’లో ఆమె నటించింది. అయితే… ఈ సినిమా మానుషీని నిరాశకు గురిచేసింది.
కన్నడ చిత్రసీమతో వెండితెరకు పరిచయం అయిన రుక్మిణీ వసంత్ కూడా ఇదే యేడాది తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఆమె ఇప్పటికే కన్నడ అనువాద చిత్రం ‘సప్త సాగరాలు దాటి’తో తెలుగువారికి సుపరిచితురాలు. ఆ సినిమా కొద్ది గ్యాప్ తో రెండు భాగాలుగా వచ్చింది. కమర్షియల్ గా గొప్ప విజయాన్ని తెలుగులో అందుకోలేకపోయినా… నటిగా రుక్మిణీ వసంత్ కంటూ కొంత మంది అభిమానులను సంపాదించి పెట్టింది. ఆమె నటనకు ఫిదా అయిన దర్శక నిర్మాతలు సుధీర్ వర్మ, బీవీయస్ఎన్ ప్రసాద్… తాము నిఖిల్ తో తీసిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రంలో నాయికగా ఎంపిక చేసి, తెలుగు రంగానికి పరిచయం చేశారు. కానీ ఈ సినిమా ఏ స్థాయిలోనూ ఆడియెన్స్ ను మెప్పించలేకపోయింది. అయితే రుక్మిణి వసంత్ ను మాత్రం తెలుగు సినిమా రంగం తిరస్కరించలేదు. ఆమె ప్రస్తుతం ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’ మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది. విజయ్ దేవరకొండ సరసన కూడా ఓ సినిమాలో రుక్మిణి ఎంపికైందనే వార్తలు ఆ మధ్య బాగా వినిపించాయి.
ఇది కూడా చదవండి: Allu Arjun: తెలంగాణలో నీ సినిమాలు ఆడనివ్వం.. అల్లు అర్జున్ కు ఎమ్మెల్యే మాస్ వార్నింగ్!
2024 New Heroines: లక్నో భామ పంఖురీ గిద్వానీ అందాల రాణి పోటీలలో పాల్గొనడమే కాదు… మోడలింగ్ లోనూ రాణించింది. ఆ తర్వాత రెండు మూడు హిందీ సినిమాల్లోనూ, వెబ్ సీరిస్ లలోనూ నటించింది. నవదీప్ హీరోగా నటించిన ‘లవ్ మౌళి’ మూవీతో పంఖురీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది కానీ ఈ ట్రావెల్ బేస్డ్ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
మల్లువుడ్ భామలు తెలుగు సినిమా రంగంలో గత కొంతకాలంగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అందులో చాలామంది విజయాన్ని అందుకుంటున్నారు. అలా ఈ యేడాది రెండు విజయవంతమైన చిత్రాలతో ఇద్దరు మల్లూవుడ్ భామలు నటించారు. వారిద్దరికీ తెలుగులో ఇవే మొదటి సినిమాలు. మలయాళంలో నటిగా చక్కని గుర్తింపు తెచ్చుకుంది అన్నా బెన్. ఆమె తొలిసారి తెలుగు చిత్రసీమలోకి ‘కల్కి 2898 ఎ.డి.’తో ఎంట్రీ ఇచ్చింది. ఇందులోని ప్రేమకథలోనే కాదు… యాక్షన్ పార్ట్ లోనూ తన సత్తా చాటింది అన్నాబెన్. ఇక ఇప్పటికే పలు మలయాళ చిత్రాలలో నటించిన తన్వీరామ్ తెలుగులోకి ‘క’ మూవీతో అడుగుపెట్టింది. కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమాలో ఆమె కథానాయిక కాకపోయినా.. ఆ స్థాయి పాత్రను పోషించి, మెప్పించింది.
తెలుగు సినిమా రంగంలో కొందరు కొత్త భామలకు జయాపజయాలతో నిమిత్తం లేకుండా అవకాశాలు లభిస్తుంటాయి. అలా ఈ యేడాది ఎంట్రీ ఇచ్చిన వారిలో లక్కీ ఛార్మ్ ఎవరంటే అందరూ చెప్పే పేరు భాగ్యశ్రీ బోర్సే!
హిందీచిత్రం ‘రైడ్’ ఆధారంగా తెలుగులో రూపుదిద్దుకున్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది భాగ్యశ్రీ బోర్సే. హిందీలో ‘యారియన్ -2’, ‘చందు ఛాంపియన్’ సినిమాలలో నటించిన భాగ్యశ్రీ బోర్సే ను దర్శకుడు హరీశ్ శంకర్ ఎంతో ఇష్టపడి ఇక్కడకు తీసుకొచ్చారు. అమ్మడి గ్లామర్ ట్రీట్ కు కుర్రకారు ఫిదా అయినా… మూవీ కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. కానీ భాగ్యశ్రీ బోర్సే దశ మాత్రం భలేగా తిరిగింది. విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, దుల్కర్ సల్మాన్ సరసన అమ్మడు అవకాశాలను అందిపుచ్చుకుంది. వీటిలో ఏ ఒకటి రెండు సక్సెస్ అయినా… టాలీవుడ్ లో భాగ్యశ్రీ స్టార్ హీరోయిన్స్ జాబితాలోకి చేరిపోవడం ఖాయం.
2024 New Heroines: హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తొలి యేడాదినే ఏకంగా మూడు చిత్రాలలో నటించే ఛాన్స్… అవన్నీ బ్యాక్ టూ బ్యాక్ రిలీజ్ కావడం అనేది నయన్ సారిక విషయంలోనే జరిగింది. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘గం గం గణేశ’ చిత్రంలో నయన సారిక హీరోయిన్ గా నటించింది. ఆ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఇదే సమయంలో నయన సారిక నటించిన ‘ఆయ్’ మూవీ వచ్చింది. ఎన్టీఆర్ బావమరిది నితిన్ నార్నే హీరోగా నటించిన ‘ఆయ్’ చిత్రం గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కి చక్కని వినోదాత్మక చిత్రంగా పేరు తెచ్చుకుంది. అంతే కాదు… కమర్షియల్ గానూ మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత వచ్చిన కిరణ్ అబ్బవరం ‘క’ సినిమాలోనూ నయన్ సారిక హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సైతం యాభై కోట్లకు పైగా గ్రాస్ ను సాధించింది. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న నయన్ సారిక ఈ యేడాది ‘బెంచ్ లైఫ్’ అనే వెబ్ సీరిస్ లోనూ నటించేసింది.
శ్రీవిష్ణు వైవిధ్యమైన కథాంశాలకు ప్రాధాన్యమిస్తుంటాడు. అలానే హీరోయిన్ల ఎంపిక విషయంలోనూ చాలా చ్యూజీగా ఉంటాడు. అతను నటించిన ‘ఓం భీమ్ బుష్’ మూవీతో ప్రీతి ముకుందన్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ వినోదాత్మక చిత్రం కమర్షియల్ గానూ గౌరవప్రదమైన విజయాన్ని అందుకుంది. విశేషం ఏమంటే… ఇదే యేడాది ఆమె తమిళ చిత్రసీమలోకీ అడుగుపెట్టింది. ఇక ‘ఓం భీమ్ బుష్’తో పాటే మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘కన్నప్ప’ మూవీలోనూ ప్రీతి ముకుందన్ నాయికగా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ నెలలో విడుదల కానుంది.
మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా నటించిన రెండో సినిమా ‘దేవకీ నందన వాసుదేవ’. ఈ సినిమా కమర్షియల్ గా ఆడకపోయినా… ఈ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన మానస వారణాసికి మంచి గుర్తింపు లభించింది. క్యూట్ గా ఉండే మానస ను యువీ క్రియేషన్స్ సంస్థ తమ చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ లో నాయికగా ఎంపిక చేసుకుంది. ఇందులో సంతోష్ శోభన్ హీరో. అందాల పోటీలలో పాల్గొన్న అనుభవం ఉన్న మానసా వారణాసి ఎప్పటికైనా తనకు నటిగా గుర్తింపు లభిస్తుందనే ఆశాభావంతో ముందుకు సాగుతోంది.
2024 New Heroines: యువ కథానాయకుడు రాజ్ తరుణ్ నటించిన నాలుగు సినిమాలు ఈ యేడాది విడుదల అయ్యాయి. అందులో నాగార్జున నటించిన ‘నా సామిరంగా’ ఒకటి. ఇక మిగిలిన మూడు అతను సోలో హీరోగా నటించిన సినిమాలే. విశేషం ఏమంటే ఈ మూడు సినిమాలతోనూ ముగ్గురు కొత్త భామలు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ‘పురుషోత్తముడు’ మూవీతో హాసిని సుధీర్ హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అలానే ‘భలే ఉన్నాడే’ మూవీతో మనీషా కంద్కూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
నిజం చెప్పాలంటే రాజ్ తరుణ్ సోలో హీరోగా నటించిన మూడు చిత్రాలు ‘పురుషోత్తముడు, భలే ఉన్నాడే, తిరగబడరా సామీ’ పరాజయం పాలయ్యాయి. అయితే… ఇందులోని ‘తిరగబడరా సామీ’ మూవీది చిత్రమైన కథ. ఈ సినిమాతో తెలుగు సినిమా రంగంలోకి పరిచయం అయిన మాల్వీ మల్హోత్రాతో రాజ్ తరుణ్ కు అనుబంధం ఉందని, అందుకే తనను అతను పక్కన పెట్టేశాడంటూ అతని ప్రియురాలు లావణ్య పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్ తో భౌతికంగానూ పోరాడటానికి ప్రెస్ మీట్స్ లో హంగామా సృష్టించింది. మాల్వీ మల్హోత్రా సైతం లావణ్య తనను అప్రతిష్టపాలు చేస్తోందంటూ పోలీసు కేసు పెట్టింది. రాజ్ తరుణ్ అతని వెండితెర కథానాయిక మాల్వీ మల్హోత్రా మధ్య ఎలాంటి అనుబంధం ఉందో తెలియదు కానీ ఈ వ్యవహారంలో మీడియాలో మాత్రం వీరిద్దరూ విపరీతంగా నానారు.
కొంతమంది కథానాయికల జీవితాలు ఎలా మొదలై ఎటుకి దారితీస్తాయో అర్థం కాదు. స్క్రీన్ ను తమతో షేర్ చేసుకున్న వ్యక్తినే జీవిత భాగస్వామిగా చేసుకోవడం అనేది సినిమా వాళ్ళ విషయంలో భలేగా జరుగుతుంటుంది. ఈ యేడాది సైతం అలాంటి ఓ జంటకు సాక్షీభూతంగా నిలిచింది.
2024 New Heroines: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడి కొడుకు నారా రోహిత్. ‘బాణం’ సినిమాతో చిత్రసీమలోకి అడుగుపెట్టి… అక్కడ నుండి పలు విజయవంతమైన చిత్రాలలో నటించాడు. అతను హీరోగా నటించిన ‘ప్రతినిధి -2’సినిమా ఈ ఏడాది విడుదలైంది. ఈ సినిమాతోనే సిరి లెల్లా హీరోయిన్ గా తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. ఇంతవరకూ పెళ్ళి ఊసే ఎత్తని నారా రోహిత్ తో ఈ వెండితెర నాయిక ప్రేమలో పడింది. వెండితెరపై కలిసి నటించిన వీరు జీవితాంతం తమ ప్రయాణాన్ని కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నారు. పెద్దల ఆశీస్సులతో వివాహ నిశ్చితార్థం సైతం జరిగింది. అయితే… నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు మరణంతో ఈ పెళ్ళి వాయిదా పడింది. ఏదేమైనా… తన తొలిచిత్ర కథానాయకుడినే జీవిత కథానాయకుడిగా సిరి లేల్ల మార్చేసుకోవడం విశేషమే.
ఈ యేడాది మొదటి రోజునే నూతన నటీనటులు, దర్శకుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే ‘సర్కారు నౌకరి’. ప్రముఖ గాయని సునీత తనయుడు ఆకాశ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయితే… భావన హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అయితే ఈ సినిమా కథపరంగా మంచి మార్కులే వేయించుకుంది కానీ కమర్షియల్ గా మాత్రం సక్సెస్ కాలేదు. దీనిని కె. రాఘవేంద్రరావు నిర్మించడం విశేషం.
సినిమా సక్సెస్ మాట ఎలా ఉన్నా… కొన్ని సినిమాలు నటీనటులకు మంచి తృప్తిని కలిగిస్తాయి. అలా ఈ యేడాది వచ్చిన కొన్ని చిన్న సినిమాలలో చక్కని అనుభూతిని కలిగించిన సినిమా ‘షరతులు వర్తిస్తాయి’. ఈ సినిమాతో భూమి శెట్టి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. చేసింది పల్లెటూరి అమ్మాయి పాత్రే అయినా… అందులో చక్కగా ఒదిగిపోయింది భూమి శెట్టి.
అచ్చ తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దక్కడం లేదని చాలామంది వాపోతుంటారు. అయితే కొందరికి అవకాశం కలిసి వచ్చినా… అదృష్టం లేకపోతే… సినిమాలు పరాజయం పాలై ఆ పైన కెరీర్ అగమ్య గోచరంగా మారిపోతుంటుంది. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంది తాన్వీ ఆకాంక్ష. ఈ తెలుగు అమ్మాయికి ప్రముఖ దర్శకుడు కె. విజయ భాస్కర్ దర్శకత్వంలో నటించే అవకాశం లభించింది. విజయ్ భాస్కర్ తన కొడుకు శ్రీకమల్ ను హీరోగా పెట్టి, తాన్వీ ఆకాంక్షను హీఓయిన్ గా పరిచయం చేస్తూ ‘ఉషా పరిణయం’ అనే సినిమా నిర్మించారు. కానీ ఇది పరాజయం పాలై చిత్ర బృందాన్ని నిరాశకు గురిచేసింది.
2024 New Heroines: ఈ యేడాది పలు చిత్రాలలో నటించిన నూతన కథానాయికలు చాలామందే ఉన్నారు. ఆయుషీ పటేల్ ‘కలియుగం పట్టణంలో’ మూవీతో తెలుగు సినిమా రంగంలోకి అడుగుపెట్టింది. విశేషం ఏమంటే తన తొలి చిత్ర కథానాయకుడు విశ్వ కార్తికేయతోనూ ఆమె మరో సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ కొత్త సినిమా దసరా రోజు పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ‘రాజు యాదవ్’మూవీతో అంకితా ఖరత్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అలానే ‘మా ఊరి రాజిరెడ్డి’తో వైష్ణవి కాంబ్లే, ‘ప్రణయ గోదారి’తో ప్రియాంక ప్రసాద్ హీరోయిన్లుగా పరిచయం అయ్యారు. ప్రణీకాన్వికా అయితే… తొలి చిత్రంలోనే టైటిల్ రోల్ ప్లే చేసింది. అదే ‘మార్కెట్ మహాలక్ష్మీ’. త్రిగుణ్ ‘లైన్ మ్యాన్’తో కాజల్ కుందర్ తెలుగు లోకి అడుగుపెట్టింది.
వెన్నెల కిశోర్ టైటిల్ రోల్ ప్లే చేసిన సినిమా ‘చారి 111’. కమర్షియల్ గా ఈ సినిమా విజయం సాధించకపోయినా… చూసిన వారిని బాగానే మెప్పించింది. ఈ సినిమాతోనే సంయుక్త విశ్వనాథన్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. అలానే సత్యదేవ్ నటించిన ‘కృష్ణమ్మ’ చిత్రంతో అతిరా రాజీ తెలుగువారి ముందుకు వచ్చింది. పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరామ్ శంకర్ హీరోగా నటించిన ‘వెయ్ దరువెయ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చింది యషా శివకుమార్. అయితే వీరెవరికీ ఆశించిన స్థాయిలో విజయాలు దక్కలేదు.
ఈ యేడాది ప్రారంభం రోజునే కాదు… చివరి శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాతోనూ కొత్త కథానాయికలు అదృష్టం పరీక్షించుకుంటున్నారు. డిసెంబర్ 27న ‘డ్రింకర్ సాయి’ మూవీ విడుదల అవుతోంది. ఈ సినిమాతో ధర్మ హీరోగా పరిచయం అవుతుంటే… ఐశ్వర్య శర్మ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. జమ్ముకి చెందిన ఐశ్వర్య శర్మ తండ్రి స్టేజ్ యాక్టర్. తండ్రి నుండి నటనను పుణికి పుచ్చుకున్న ఐశ్వర్య తొలిచిత్రం ఇదే కావడం విశేషం. మరి ఈ అందాల భామకు ‘డ్రింకర్ సాయి’ మూవీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
ఈ యేడాది స్ట్రయిట్ తెలుగు సినిమాలు దాదాపు రెండువందల యాభై వరకూ విడుదల అయ్యాయి. అందులో చాలా చిత్రాలలో కొత్త అమ్మాయిలే హీరోయిన్లుగా నటించారు. అయితే… వారిలోనూ జయాపజయాలతో నిమిత్తం లేకుండా అవకాశాలు అందిపుచ్చుకున్నవారు కొందరైతే… ఇలా వచ్చి అలా వెళ్ళిపోయిన వారు మరికొందరు. ఏదేమైనా నవతరం నాయికలకు వచ్చే యేడాది అయినా మంచి విజయాలు దక్కాలని కోరుకుందాం.