Hyderabad: హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన కలకలం సృష్టించింది. చదువుకుంటున్న ఒక యువతి (17) తన సొంత ఇంటిలోనే అతి కిరాతకంగా హత్యకు గురైంది. ముఖ్యంగా ఈ ఘోరం ఆమె తల్లి కళ్ల ముందే జరగడం మరింత బాధాకరం.
ఈ దారుణం వారాసిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. యువతిని హత్య చేసింది ఎవరో కాదు, ఆమెకు మేనమామ వరుసయ్యే యువకుడే. సదరు యువకుడు కత్తితో యువతి గొంతు కోసి చంపేశాడు. కళ్ల ముందు కూతురు చనిపోవడం చూసి ఆ తల్లి గుండె పగిలిపోయింది.
హత్య చేసిన యువకుడు ఆ ప్రాంతం నుంచి పారిపోయే ముందు, తాను ఉపయోగించిన కత్తిని, తన సెల్‌ఫోన్‌ను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ విషయం పోలీసులకు తెలియగానే, వారాసిగూడ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, వివరాలు సేకరించేందుకు క్లూస్ టీమ్‌ను రప్పించారు.
అసలు ఈ దారుణానికి కారణాలు ఏమిటి? మేనమామ వరుసయ్యే వ్యక్తి ఇంత కఠినంగా ఎందుకు ప్రవర్తించాడు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు, హత్య వెనుక ఉన్న నిజాలను తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

