Mexico Mass Shooting: మెక్సికో దేశంలో మరోసారి కాల్పుల కలకలం చోటు చేసుకుంది. గ్వానాజువాటో రాష్ట్రంలోని ఇరాపువాటో అనే నగరంలో బుధవారం రాత్రి ఘోర ఘటన జరిగింది. ఓ వీధి పండుగ సందర్భంగా ప్రజలు జానపద డప్పులు వాయిస్తూ, డ్యాన్స్ చేస్తూ సందడిగా ఉన్న సమయంలో ఒక దుండగుడు అకస్మాత్తుగా కాల్పులకు తెగబడ్డాడు.
ఈ అతి దారుణమైన ఘటనలో 12 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు తెలిపారు.
వేడుక మధ్యలో హఠాత్తుగా కాల్పులు
ఈ పండుగను సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ గౌరవార్థంగా జరుపుకుంటున్నారు. పండుగ ఉత్సాహంగా సాగుతుండగా, ఒక అనుమానాస్పద వ్యక్తి గన్‌తో వచ్చి ప్రజలపై కాల్పులు జరిపాడు. సడెన్ షాక్కు గురైన ప్రజలు భయంతో పరుగులు తీశారు. అక్కడున్న వాతావరణం ఒక్కసారిగా ఉల్లాసం నుంచి విషాదంగా మారిపోయింది.
అధికారుల స్పందన
ఈ ఘటనపై ఇరాపువాటో అధికారి రోడాల్ఫో గ్మెజ్ సెర్వంటెస్ స్పందిస్తూ.. ఇది అత్యంత బాధాకరం. ఇప్పటివరకు 12 మంది మృతి చెందారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాం. నిందితుడిని పట్టుకునేందుకు దర్యాప్తు జరుగుతోంది అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: రెండేళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం..
మెక్సికో అధ్యక్షురాలి తీవ్ర ఖండన
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షేన్‌బామ్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. వేడుకల మధ్య ఇలాంటి హింసాత్మక ఘటనలు జరగడం దురదృష్టకరమని, బాధిత కుటుంబాలకు తాను అండగా ఉంటానని చెప్పారు.
ఇదే ప్రాంతంలో మళ్లీ దాడి..
ఇది ఒక్కసారి మాత్రమే కాదు. ఇదే రాష్ట్రంలోని మరో ప్రాంతం శాన్ బార్టోలో డి బెర్రియోస్లో గత నెలలో జరిగిన కాల్పుల్లో కూడా 7 మంది మరణించారు. మొత్తం చూస్తే ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లో గ్వానాజువాటో రాష్ట్రంలో 1,435 మంది హత్యలు జరిగాయి.
ఈ వార్తకు సంబంధించిన వీడియోలు, దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలాంటి హింసాత్మక ఘటనలు ఎప్పటికైనా ఆగాలని ప్రజలు కోరుతున్నారు. పండుగల వాతావరణంలో భయాన్ని కాకుండా సంతోషాన్ని పంచుకునే రోజులు రావాలని ఆశిద్దాం.