Chhattisgarh: ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దక్షిణ సుక్మా లోని భెజ్జీ ప్రాంతం కుంటా పోలీస్ స్టేషన్ పరిధిలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, మావోయిస్టుల మద్య శుక్రవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి.ఈ ఎదురుకాల్పుల్లో 10 మంది మావోలు హతమయ్యారని బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు.ప్రస్తుతం ఆ ప్రాంతంలో మావోల కోసం వేట కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగినట్లు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కిరణ్ చవాన్ ధృవీకరించారు. ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి మూడు ఆటోమేటిక్ తుపాకులతో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.
కాగా, ములుగు జిల్లాలో మావోయిస్టులు బీభత్సం సృష్టించారు. ఇద్దరినీ అతి కిరాతకంగా చంపారు. ములుగు జిల్లా వాజేడు మండలంలోని ఏజెన్సీ ప్రాంతమైన పెను గోలు కాలనీలో మావోయిస్టులు పోలీసుల ఇన్ ఫార్మర్ నెపంతో ఇద్దరు గిరిజనులను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. మృతుల్లో ఒకరైన ఉయిక రమేష్ పేరూరు పంచాయతీ కార్యదర్శి గా పనిచేస్తున్నారు. ఇదే గ్రామానికి చెందిన ఉయిక అర్జున్ అనే గిరిజన వ్యక్తిని గొడ్డలితో నరికి చంపారు. ఉయిక అర్జున్ అక్కడికక్కడే మృతి చెందగా రమేష్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా కుటుంబ సభ్యులు 108 సహాయంతో ఏటూరు నాగారం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు
వీరిద్దరు వ్యక్తులు కూడా పోలీసులకు ఇన్ ఫార్మర్లుగా మారి గత కొద్ది సంవత్సరాలుగా మావోయిస్టు కదలికలను పోలీసులకు చేరవేస్తూ మావోయిస్టులపై దాడులకు కారకులు అయ్యారని అందుకే వారిని చంపినట్టు తెలుస్తుంది… మావోలు వీరిద్దరికి పలు మార్లు హెచ్చరించారు. అయినా వీరు పద్ధతి మార్చుకోకపోవడంతో హతమార్చడం జరిగిందని వాజేడు వెంకటాపురం ఏరియా కార్యదర్శి శాంత పేరుతో లేఖలో పేర్కొన్నారు. వీరిద్దరి హత్య ఏజెన్సీలో మరోసారి కలకలం సృష్టించింది. ఈ దారుణ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం ఏటూరు నాగారంలోకి ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.