YS Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వరుసగా పార్టీకి ఊపిరి పోసే చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వేడి పెరుగుతున్న తరుణంలో, నేతల క్రమశిక్షణ, ప్రజా ప్రతినిధులకు భరోసా కల్పించేందుకు జగన్ తాడేపల్లిలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ రోజు తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ సమావేశానికి నాలుగు కీలక జిల్లాలకు చెందిన స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నారు. వీరిలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మున్సిపాలిటీ, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు ఉన్నారు.
ఈ సమావేశంలో ఎంపీపీలు, ఎంపీటీసీలు, మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొంటున్నారు. అధికారం కోసం పోరాటం కొనసాగుతుందన్న సంకేతాన్ని ఇస్తూ, పార్టీకి కట్టుబడి ఉండాలని, ఎవరు వెనక్కి తియ్యరాదని, తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సేవలకు సరైన గుర్తింపు ఇస్తామన్న భరోసాతో జగన్ వారిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ఇది కూడా చదవండి: Padma Awards 2025: రాష్ట్రపతి భవన్లో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానం..
ఇక మరోవైపు, జగన్ నేడు ప్రకాశం జిల్లా పొదిలికి పర్యటనకు వెళ్తున్నారు. పొదిలిలోని పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించి, రైతుల పరిస్థితులను స్వయంగా తెలుసుకోనున్నారు. గిట్టుబాటు ధరల కోసం కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ఈ పర్యటన వెనుక ప్రధాన ఉద్దేశ్యం. రైతులకు మద్దతుగా, పక్కా రోడ్డు మ్యాప్‌తో జగన్ ముందడుగు వేస్తున్నారు.
ఈ రెండు కార్యక్రమాలూ పార్టీకి నూతన ఊపునిచ్చేలా, ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలా, ప్రజా ప్రతినిధుల్లో నిబద్ధతను పెంపొందించేలా సాగనున్నాయి. రాష్ట్రంలో రాజకీయంగా కీలకమైన ఈ సమయంలో జగన్ తాజా చర్యలు గమనార్హం.