CJP Protest: “కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు”.. సరిగ్గా ఇలాగే ముగిసింది ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) తలపెట్టిన రెండో విడత మహాధర్నా. గతంలో నీట్ (NEET) పేపర్ లీకేజీ అంశంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం జెన్‌జీ (Gen-Z) యువత, బొద్దింకల సైన్యం చేసిన పోరాటం దేశం మొత్తాన్ని కదిలించింది. బలవంతుడైన మోదీ సర్కార్ సైతం యువత దెబ్బకు దిగిరాక తప్పలేదు. దాంతో అంతర్జాతీయ స్థాయిలో జెన్‌జీ ఉద్యమానికి పెద్ద పేరు వచ్చింది.
ఆ ఊపుతోనే కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ రాజీనామాను డిమాండ్ చేస్తూ సీజేపీ ‘జంతర్ మంతర్ 2.0’ పోరాటానికి పిలుపునిచ్చింది. ముంబై, బెంగళూరు ర్యాలీలు సూపర్ సక్సెస్ కావడం.. యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, నటుడు ప్రకాశ్ రాజ్ వంటి వారు తోడవడంతో ఈ నిరసనపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తీరా చూస్తే.. ఆందోళన జరగాల్సిన రోజే సీజేపీ నేతలు చేతులెత్తేశారు. కనీసం జంతర్ మంతర్ పరిసరాల్లోకి కూడా అడుగుపెట్టలేకపోయారు.
అసలు ఇంత పెద్ద ఉద్యమం అనుకున్న స్థాయిలో ఎందుకు జరగలేదు? ప్రణాళికా లోపమా లేక అతి విశ్వాసమా? ఈ వైఫల్యానికి దారితీసిన టాప్ 5 ప్రధాన కారణాలను పరిశీలిస్తే:
1. పక్కా గ్రౌండ్ ప్లాన్ లేకపోవడం – సోషల్ మీడియాకే పరిమితం కావడం:
ఒక భారీ రాజధాని ముట్టడికి దిగినప్పుడు సోషల్ మీడియా పిలుపులు మాత్రమే సరిపోవు. క్షేత్రస్థాయిలో వేలాది మంది జనం ఢిల్లీకి వస్తే.. వాళ్లను ఎలా సమీకరించాలి, ఎక్కడికి చేర్చాలనే ప్రణాళిక సీజేపీ వద్ద కనిపించలేదు. పదే పదే ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో వీడియోలు పెట్టడం, కేంద్రంపై సెటైర్లు వేయడానికే నేతలు పరిమితమయ్యారు. గ్రౌండ్‌లో బలమైన ప్లాన్ లేకపోవడమే ఈ వైఫల్యానికి మొదటి కారణం.
2. అతి విశ్వాసం, అల్ప సంతోషం:
ధర్మేంద్ర ప్రధాన్ ఎపిసోడ్‌లో విజయం దక్కేసరికి సీజేపీ అగ్రనేతల్లో అతి విశ్వాసం (Overconfidence) పెరిగిపోయింది. ‘మేము పిలుపునిస్తే చాలు కేంద్రం గడగడా వణికిపోతుంది’ అనే భ్రమలో ఉండిపోయారు. శనివారం నాటి ఆంక్షలను చూసి.. “మోదీ భయపడ్డాడు, అందుకే మెట్రోలు ఆపేశాడు, రైళ్లు రద్దు చేశాడు” అని వీడియోలు చేసుకుంటూ సంబరపడ్డారే తప్ప, ఆ ఆంక్షలను దాటుకుని వేదిక వద్దకు ఎలా చేరుకోవాలో ఆలోచించలేకపోయారు. పోలీసుల ఆంక్షలనే తమ విజయంగా భావించి అల్పసంతోషంతో సరిపెట్టుకున్నారు.
3. ముందే వ్యూహాలను బయటపెట్టి కేంద్రాన్ని అలెర్ట్ చేయడం:
ఆందోళన ఎప్పుడు చేస్తాం, ఎక్కడికి వస్తాం, విమానాల్లో వస్తున్నామా, రైళ్లలో వస్తున్నామా అనే వివరాలను సీజేపీ నేతలే పదే పదే బహిరంగ ప్రకటనల ద్వారా బయటపెట్టారు. దాంతో కేంద్ర హోంశాఖ, ఢిల్లీ పోలీసులు పూర్తి సమయం తీసుకుని పక్కా వ్యూహం సిద్ధం చేశారు. 23 వేల మంది పారామిలటరీ బలగాలను దింపడం, ఘాజీపూర్ వద్ద రాతి బారికేడ్లు పెట్టడం, విమానాశ్రయంలోనే ఫ్లైట్ దిగకముందే నేతలను అరెస్ట్ చేయడం వంటి చర్యలతో సీజేపీ అడుగులను కేంద్రం ముందే కట్టడి చేయగలిగింది.
4. నాయకత్వ లేమి – ప్లాన్-B లేకపోవడం:
ఒక పెద్ద ప్రజా ఉద్యమం చేసేటప్పుడు ప్రధాన నాయకులు అరెస్టయితే ఏం చేయాలనే ‘ప్లాన్-బి’ కచ్చితంగా ఉండాలి. కానీ ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అభిజీత్ దీప్కే, ఇతర నేతలు, అటు గురుగ్రామ్‌లో ధ్రువ్ రాఠీ అరెస్ట్ కాగానే మొత్తం మూవ్‌మెంట్ గందరగోళంలో పడిపోయింది. వేలాది మంది యువత రోడ్లపైకి రావడానికి సిద్ధంగా ఉన్నా.. వారిని ముందుకు నడిపించేందుకు రెండో శ్రేణి నాయకత్వం గ్రౌండ్‌లో లేకుండా పోయింది.
5. రాజకీయ పార్టీల పోరాట స్ఫూర్తిని అందిపుచ్చుకోలేకపోవడం..
ఓవైపు ఇండియా కూటమి (రాహుల్, ప్రియాంక టీమ్) గత మూడు రోజులుగా అరెస్టులు జరుగుతున్నా వెనక్కి తగ్గకుండా రోడ్లపై బైఠాయించి పోరాటం చేస్తోంది. అలాంటి రాజకీయ పోరాటాల నుంచి సీజేపీ ఎలాంటి వ్యూహాలనూ నేర్చుకోలేదు. సంస్థాగత నిర్మాణం, క్రమశిక్షణ గల క్యాడర్ లేకపోవడంతో పాటు.. నాయకులు కేవలం ప్రసంగాలు, అరెస్టుల బిల్డప్‌లకే ప్రాధాన్యత ఇవ్వడంతో ఆందోళన కాస్తా ఆవిరైపోయింది.
కేంద్రం భయపడిందా లేదా అనేది నరేంద్ర మోదీకి ముఖ్యం కాదు.. నిరసనను అణచివేయాలన్న లక్ష్యంలో ప్రభుత్వం విజయం సాధించింది. కానీ సీజేపీ మాత్రం.. “ప్రభుత్వం భయపడింది చూశారా?” అని చెప్పుకుంటూ తమ అహాన్ని సంతృప్తి పరుచుకోవడానికే పరిమితమైంది. ఇది జెన్‌జీ యువత వైఫల్యం ఎంతమాత్రం కాదు.. వాళ్లను సరైన దారిలో నడిపించడంలో విఫలమైన కాక్రోచ్ పార్టీ అగ్రనాయకత్వానిదే!
