Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘వారణాసి’ (Varanasi) కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ (RRR) లాంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, ముందుగా ప్రకటించినట్లు 2027 ఏప్రిల్ 7న ఈ సినిమా థియేటర్లలోకి రావడం కాస్త కష్టమేనని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
రాజమౌళి సినిమా అంటే విజువల్స్, గ్రాఫిక్స్ ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్వాలిటీ విషయంలో జక్కన్న అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఈ సినిమాలో అత్యంత కీలకమైన కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజరీ (CGI) మరియు వీఎఫ్ఎక్స్ (VFX) పనులకు ఇంకాస్త ఎక్కువ సమయం పట్టేలా ఉందట. కేవలం ముందే అనుకున్న తేదీకి రావాలనే ఉద్దేశంతో పనులను హడావుడిగా పూర్తి చేయడం రాజమౌళికి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే విజువల్ ఎఫెక్ట్స్‌ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు రిలీజ్‌ను కాస్త వెనక్కి జరపాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.
మొదట ఏప్రిల్ 7న ఉగాది, ఆ తర్వాత వారం శ్రీరామనవమి పండుగ సెలవులు కలిసి వస్తాయని ఆ తేదీని లాక్ చేశారు. ఇప్పుడు ఆ పండుగ సెలవుల అడ్వాంటేజ్ మిస్ అయినా, అంతకంటే పెద్ద పండుగను మహేష్ అభిమానులకు ఇచ్చేలా టీమ్ కొత్త తేదీలను పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా 2027 జూలై 29, ఆగస్టు 5 లేదా ఆగస్టు 12 తేదీలపై చిత్రబృందం చర్చలు జరుపుతోంది. వీటిలో ఆగస్టు మొదటి లేదా రెండో వారంలో సినిమాను విడుదల చేసేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఒకవేళ ఆగస్టు మొదటి వారంలో ‘వారణాసి’ విడుదలైతే మహేష్ బాబు అభిమానులకు అది డబుల్ సెలబ్రేషన్ అవుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు. ప్రతి ఏడాది ఆయన బర్త్‌డే సందర్భంగా పాత సినిమాల రీ-రిలీజ్‌లతోనే ఫ్యాన్స్ థియేటర్లలో పండుగ చేసుకుంటారు. అలాంటిది ఏకంగా రాజమౌళి – మహేష్ సినిమానే బర్త్‌డే వీక్‌లో రిలీజ్ అయితే అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఈ కొత్త విడుదల తేదీపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మహేష్ బాబు, రాజమౌళి తొలిసారి కలిసి పనిచేస్తున్న ఈ భారీ ప్రాజెక్టులో మహేష్ ‘రుద్ర’ (Rudhra) అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా జోనాస్, మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో అత్యంత కీలక పాత్రలు పోషిస్తున్నారు.
