Team India: న్యూజిలాండ్ సిరీస్ లో వైట్ వాష్ కు కారణం టీమిండియా బ్యాటర్ల వైఫల్యమా? ఆల్రౌండర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదా? లేక బౌలర్లు గాడితప్పడమా? ఫ్యాన్స్ బుర్రలో ఇలాంటి సందేహాలు ఆసీస్ సిరీస్ స్టార్టయ్యేదాకా తిరుగుతూనే ఉంటాయి. కివీస్ చేతిలో ఓడిన మూడు టెస్టుల్లో ఆడిన 14 మంది టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనపై ఓ లుక్కేద్దామా? ఈ సిరీస్లో వారికి మార్కులేస్తే ఎవరికి ఏ ర్యాంకు వస్తుందో చూద్దామా?
రోహిత్ శర్మ, పదికి 3 మార్కులు.
టీమిండియా సారథి… ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు. మిగతా 5 ఇన్నింగ్సుల్లో ఫెయిల్యూరే. ఇందులో ఒకటి రెండు సార్లు మంచి బాల్స్ కే అవుటైనా… మిగతా సందర్భాల్లో అన్నీహై రిస్క్ షాట్లు. అవసరం లేనివి. బౌలింగ్పై ఆరంభంలోనే దాడికి వెళ్లకుండా ఇన్నింగ్స్ కు యాంకర్ వేసుంటే ఫలితం ఎలా ఉండేదో చెప్పడం కష్టమే. రోహిత్ వరకు ఈ సిరీస్ వెంటాడే ఓ పీడకల.
యశస్వి జైస్వాల్, పదికి 5 మార్కులు
Team India: యంగ్ సెన్సేషన్ యశశ్వి జైస్వాల్ ను బాగా నిరాశపరిచిన సిరీస్ ఇది. ఆరు ఇన్నింగ్స్ లలో 4 సార్లు ముప్ఫయిలలోకి చేరాడు. అందులో ఒక్కసారి మాత్రమే స్కోరు 40 దాటించగలిగాడు. పుణె మ్యాచ్ ఛేజింగ్ లో ప్రమాదకరంగా కనిపించాడు. కానీ, దానినో మంచి ఆరంభంగా మలచలేకపోవడం సిరీస్ పై ఇంపాక్ట్ చూపించింది. ఏదైతేనేం ఈ క్యాలెండర్ ఇయర్లో 1119 పరుగులతో హైయస్ట్ రన్ గెటర్స్ లో మూడో స్థానంలో నిలిచాడు, అదీ 24 ఏళ్లు నిండకుండానే.
శుభ్మన్ గిల్, పదింటికి 6 మార్కులు
గిల్ మార్కు అంతగా కనిపించని సిరీస్ ఇది. తొలి టెస్టు మిస్సయిన తర్వాత రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో ప్రభావం చూపలేకపోయాడు. మూడో టెస్టులో కీలక తరుణంలో రాణించి 90 పరుగులు చేశాడు… కాస్త అదృష్టం కలిసిరావడంతో. అయితేనేం అతని ఇన్నింగ్స్ కారణంగానే మూడో టెస్టులో తొలి ఇన్నింగ్స్లో ఆధిక్యం దిశగా వచ్చింది టీమిండియా.
విరాట్ కోహ్లి, పదికి 3 మార్కులు
Team India: సేమ్ టు సేమ్ రోహిత్ శర్మ. ఒక్క ఫిఫ్టీ ఐదు ఫ్లాపులు. కాస్త డిఫరెన్స్ ఏంటంటే… టెస్టు క్రికెట్లో రనౌట్ పాత్ర, ఓ ఫుల్ టాస్ బంతికి వికెట్టివ్వడం. ఎవరూ కోరుకోనిది… కోహ్లికి దక్కింది. ఫ్యాబ్ ఫోర్ లో ఇకపై కోహ్లి పేరు చెప్పడానికి తటపాయించాల్సిన పరిస్థితి.
సర్ఫరాజ్ ఖాన్, పదికి 5 మార్కులు
ఈ సిరీస్లో భారత్ తరఫున నమోదైన ఏకైక సెంచరీ సర్ఫరాజ్దే. బెంగళూరులో తొలి ఇన్నింగ్స్ లో ఈ ఫ్యూచర్ స్టార్ చేసిన 150 పరుగుల ఇన్నింగ్స్ ను మసకబారేలా చేశాయి… ఆ తర్వాతి అతని ఇన్నింగ్స్. నాలుగు సార్లు సింగిల్ డిజిట్ స్కోర్స్, మరోసారి 11 పరుగులు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే హై రిస్క్ షాట్లకు వెళ్లి బలయ్యాడు. ఇలాంటి ఆటతీరు రంజీల్లో ఓకే గానీ హైయస్ట్ లెవెల్లో సరిపోదని అర్థమైంది సర్ఫరాజ్ కి.
రిషబ్ పంత్, పదికి 9 మార్కులు.
Team India: ముంబయిలో ఛేదనలో చేసిన 64 పరుగుల ఫిఫ్టీ… పంత్ మూడు హాఫ్ సెంచరీల్లో బెస్ట్ అని విమర్శకుల కితాబందుకుంది. బెంగళూరులో చేసిన 99 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ కూడా బెస్టే. ముంబయిలో సాధించిన 60 పరుగులూ అదుర్సే. రెండు సందర్భాల్లో మాత్రమే విఫలమయ్యాడు. మోకాలి గాయం నుంచి కోలుకుని మరీ పంత్ చెలరేగిన తీరు, సాధించిన సగటు చూస్తే గర్వించని భారత అభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదేమో.
కేఎల్ రాహుల్, పదికి 2 మార్కులు
బెంగళూరు ఇన్నింగ్స్ ఎంత త్వరగా మర్చిపోతే అంతమంచిది. గిల్ రాకతో మిగతా రెండు టెస్టుల్లో స్థానం కోల్పోయాడు.
రవీంద్ర జడేజా, పదికి 8 మార్కులు.
Team India: తొలి రెండు టెస్టుల్లో మూడు వికెట్ల హాల్ అందుకున్న జడేజా, చివరి టెస్టులో రెండు ఇన్నింగ్సుల్లోనూ 5 వికెట్ల హాల్ సాధించాడు. రెడ్ బాల్ ఫార్మట్లో మరికొంత కాలం కొనసాగించేందుకు స్ఫూర్తినిచ్చిన ప్రదర్శన ఇది.
వాషింగ్టన్ సుందర్, పదికి 9 మార్కులు.
మూడేళ్ల విరామం తర్వాత పుణె టెస్టులో పునరాగమనం చేసిన సుందర్ 11వికెట్లతో ఆశ్చర్యపరిచాడు. తొలి ఇన్నింగ్స్లో 7 వికెట్లు, రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లు. ముంబయి టెస్టులో మరో 5 వికెట్లు తీసి… అశ్విన్, జడేజాల తర్వాత టాలెంట్ ఉందన్న భరోసా ఇచ్చాడు. రెండు సందర్భాల్లో మాత్రమే విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్లో ఫరవాలేదనిపించిన సుందర్… రెండో ఇన్నింగ్స్ లో ప్రతిఘటించి చివరిగా ఔటయ్యాడు.
కుల్దీప్ యాదవ్, పదికి 3 మార్కులు
Team India: ఆడిన ఒకే ఒక టెస్టులో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో రచిన్ రవీంద్రకు బంతులు వేయడంలో రిథమ్ కోల్పోయాడు. అప్పటికే గజ్జల్లో గాయం వేధిస్తుండడంతో ఆసీస్ టూర్ కూ దూరమయ్యాడు.
జస్ ప్రీత్ బుమ్రా, పదికి 3 మార్కులు
తన కఠినమైన ప్రత్యర్థిపై సాధారణ ప్రదర్శన. మరచిపోదగిన సిరీస్. కివీస్ పై 5 టెస్టుల్లో 9 వికెట్లు మాత్రమే తీశాడు, అదీ 45.44 సగటుతో. కొన్ని చెప్పుకోదగిన స్పెల్స్ ఉన్నాయి కానీ…అవి బుమ్రా స్థాయికి తగినవికావు, అతని గౌరవాన్ని పెంచేవీ కావు.
ఆకాశ్ దీప్, పదికి 4 మార్కులు
Team India: అసాధారణ ప్రదర్శనేమీ లేదు కానీ ఆకట్టుకున్నాడు. మహ్మద్ షమీ వయసు మీరడం, ఫిట్నెస్ సమస్యలతో సతమవుతున్న తరుణంలో హోం సిరీస్ లకు ప్రత్నామ్నాయం ఆకాశ్ దీప్.
మహ్మద్ సిరాజ్, పదికి 2 మార్కులు
సొంతగడ్డపై సిరాజ్ 14 టెస్టుల్లో పడగొట్టింది 19 వికెట్లే. సగటు 37. విదేశాల్లో మాత్రం 28.65 సగటుతో 17 టెస్టుల్లో 61 వికెట్లు పడగొట్టాడు. భవిష్యత్తులో అతన్ని టీమిండియా పొదుపుగా వాడుకునే అవకాశముంది.
Team India: న్యూజిలాండ్ తో మూడు టెస్టుల సిరీస్లో టీమిండియా దారుణంగా ఓడినా… ఓ ఇద్దరి పెర్ఫామెన్స్ మాత్రం అదిరింది. వారే రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్. మరో ముగ్గురికి పాస్ మార్కులొచ్చాయి.. గిల్, జైస్వాల్, సర్ఫరాజ్ లకు. ఇక దిగ్గజాలుగా కీర్తి గడించిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు సహా అందరూ ఫెయిలయినట్లే.