warangal news: వరంగల్ జిల్లాలో నిన్న కనిపించి కలకలం సృష్టించిన పులి మళ్లీ ఓ మహిళ కంటపడింది. నల్లబెల్లి మండలం రుద్రగూడెం పరిసరాల్లో పులి కదలికలను కనిపెట్టారు. తాజాగా ఒర్రి నర్సయ్యపల్లిలో మరో మారు సంచారం కనిపించింది. దీంతో పరిసర గ్రామాల ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టకొని కాలం గడుపుతున్నారు. ఏ సమయంలో, ఎటు నుంచి పులి వస్తుందోనన్న భయంతో బిక్కుబిక్కుమంటూ వెళ్లదీస్తున్నారు. రైతులు పొలాల వైపు వెళ్లాలంటనే జంకుతున్నారు.
warangal news: ఒర్రి నర్సయ్యపల్లి గ్రామ పరిధిలోని మొక్కజొన్న చేనులో పులి కనిపించిందని ఓ మహిళ తెలిపింది. ఆ మహిళ హెచ్చరికలతో భయంతో కేకలు వేస్తూ రైతులు ఉరుకులు, పరుగులు తీశారు. ఇప్పటికే ఆ పులి కోసం ఫారెస్ట్ అధికారులు వేట కొనసాగిస్తున్నారు. దాని ఆచూకీ వారికి కనిపించడం లేదు. నల్లబెల్లి మండల పరిధిలోని 365 జాతీయ రహదారి వెంట అటవీ ప్రాంతాల్లోనే పులి సంచరిస్తుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పులి పాదముద్రలను సేకరిస్తూ, అది వెళ్లిన ప్రాంతంవైపు గాలింపు చర్యలు చేపట్టారు.
warangal news: మరోవైపు మహబూబ్‌బాద్ జిల్లా కొత్తగూడెం మండలం కోనాపురం అడవుల్లో కూడా పులి సంచారం ఉన్నట్టు అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఫారెస్ట్ రేంజర్ వజహత్ తెలిపారు. రుద్రగూడెం పరిధిలో సంచరించిన పులే చెక్కలపల్లి మీదుగా కోనాపురం వైపు వచ్చిందని, ముసలిమడుగు ప్రాంతంలో పులి పాదముద్రలు గుర్తించినట్టు వజహత్ తెలిపారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.