Vijayawada CI Ali Death Case: విజయవాడలో విధుల్లో ఉండగా గుండెపోటుతో మృతి చెందిన సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) షేక్ అహ్మద్ అలీ (54) వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. తొలుత సాధారణ గుండెపోటుగా భావించినప్పటికీ.. దీనిపై కానిస్టేబుల్ సుధాకర్ ఇచ్చిన ఫిర్యాదుతో సత్యనారాయణపురం పోలీసులు అనుమానాస్పద, అసహజ మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిరసనకారులు నెట్టివేయడం వల్లే సీఐ కిందపడి అస్వస్థతకు గురయ్యారని కానిస్టేబుల్ చేసిన ఫిర్యాదు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కానిస్టేబుల్ సుధాకర్ ఫిర్యాదులో ఏముంది?
స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులు చేపట్టిన ఆందోళన సందర్భంగా చోటుచేసుకున్న తోపులాటలో సీఐ అలీని నిరసనకారులు నెట్టుకుంటూ వెళ్లారని పేర్కొన్నారు. తోపులాట తీవ్రతకు సీఐ అలీ కిందపడిపోయారని, అనంతరం ఆయనకు తీవ్రంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. ఆ తర్వాతే ఆయనకు గుండెపోటు (హార్ట్ స్ట్రోక్) వచ్చినట్లు కానిస్టేబుల్ తన ఫిర్యాదులో వివరించారు.
ఆదివారం బందోబస్తు సమయంలో ఏం జరిగింది?
సచివాలయ ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో ఆదివారం ఉదయం 6 గంటల నుంచే సీఐ అలీ బందోబస్తు విధుల్లో పాల్గొన్నారు. ధర్నాచౌక్, అలంకార్ సెంటర్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఆయనకు గుండెలో స్వల్పంగా నొప్పి వచ్చింది. వెంటనే సూర్యారావుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి ప్రాథమిక పరీక్షలు చేయించుకుని, కాసేపటి తర్వాత బాగానే ఉందంటూ తిరిగి అలంకార్ సెంటర్ వద్దకు బందోబస్తుకు చేరుకున్నారు.
అయితే అక్కడికి వచ్చిన 10 నిమిషాల వ్యవధిలోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే పోలీస్ జీపులో ఆసుపత్రికి తరలిస్తుండగానే అలీ స్పృహ కోల్పోయారు. మెరుగైన వైద్యం కోసం ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఆసుపత్రికి తరలించి సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
రంగంలోకి దిగిన సత్యనారాయణపురం పోలీసులు..
తోపులాట జరిగిందన్న కానిస్టేబుల్ ఫిర్యాదుతో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్, వీడియో దృశ్యాలను సేకరిస్తూ, అలీ మృతికి దారితీసిన అసలు కారణాలు, నిరసనకారుల ప్రవర్తనపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
