Bandla ganesh

Bandla Ganesh: తమ్ముడూ త్వరలో నీకు అర్థమయ్యేలా చెప్తా..

Bandla Ganesh: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మచిలీపట్నం వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్‌లను టార్గెట్ చేస్తూ వైఎస్సార్‌సీపీ యువ నేత పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) చేసిన విమర్శలు రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. అయితే కిట్టు చేసిన వ్యాఖ్యలకు బండ్ల గణేష్ తనదైన శైలిలో ఘాటుగా బదులివ్వడంతో ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

పవన్-బండ్లపై పేర్ని కిట్టు వ్యాఖ్యలేంటి?

మచిలీపట్నంలో జరిగిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పేర్ని కిట్టు మాట్లాడారు.

బండ్ల గణేష్ తనకి పవన్ కళ్యాణ్ అంటే ప్రాణమని, రాముడికి హనుమంతుడిలాగా నేను పవన్ కళ్యాణ్‌కి అని అనడమే కాకుండా, పవన్ కళ్యాణ్ ఒక వ్యసనం అని, ఒక్కసారి అలవాటు అయితే వదిలించుకోవడం కుదరదు అని అవకాశం దొరికిన ప్రతిసారి మీడియా ముందు, ఆడియో లాంచ్‌లలో పదే పదే చెబుతూనే ఉంటారు, ఇది అందరికీ తెలిసిందే. కానీ ఇది అభిమానం కాదని, ఇది కేవలం కోట్ల రూపాయల బిజినెస్ మాత్రమేనని కిట్టు ఆరోపించారు.

పవన్ కళ్యాణ్ ఒక స్టార్ హీరో కావడంతో ఆయనతో సినిమాలు తీస్తే కోట్లకు కోట్లు లాభాలు వస్తాయనే ఉద్దేశంతోనే బండ్ల గణేష్ పవన్ జపం చేస్తుంటారని విమర్శించారు. “మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గానీ, కొడాలి నాని గానీ సినిమాలు తీయరు కాబట్టి బండ్ల గణేష్ వాళ్ల భజన చేయరు” అని అన్నారు. “హీరోతో సినిమా తీసి డబ్బులు సంపాదించుకోవడమే గణేష్ అసలు లక్ష్యం” అంటూ కిట్టు ఎద్దేవా చేశారు.

త్వరలో నీకు అర్థమయ్యేలా చెప్తా తమ్ముడూ..  బండ్ల గణేష్ కౌంటర్

పేర్ని కిట్టు చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ కావడం తో బండ్ల గణేష్ దృష్టికి వెళ్లాయి. దీనిపై ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా బండ్ల గణేష్ సూటిగా స్పందించారు.  పేర్ని కిట్టు మాట్లాడిన వీడియో క్లిప్‌ను తన అధికారిక ఖాతాలో రీట్వీట్ చేస్తూ ఘాటైన రిప్లై ఇచ్చారు.

“పవన్ కళ్యాణ్‌గారు ఏంటో.. ఆయన క్యారెక్టర్ ఏంటో.. ఆయన స్థాయి ఏంటో.. ఆయన స్థానం ఏంటో నీకు అన్నీ అర్థమయ్యేలా త్వరలోనే చెప్తా తమ్ముడు పేర్ని కిట్టి” అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ తరహాలో సమాధానమిచ్చారు.

పవన్ కళ్యాణ్ భక్తిని వ్యాపారంతో ముడిపెట్టిన పేర్ని కిట్టుకు, బండ్ల గణేష్ ఇచ్చిన ఈ కౌంటర్ జనసేన శ్రేణుల్లో, నెటిజన్లలో తెగ వైరల్ అవుతోంది.

bandla ganesh

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *