Vijay Sethupathi: తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బుల్లితెరపై విజయవంతంగా సాగుతున్న ‘బిగ్‌బాస్ తమిళ్’ వేదికగా ఆయన మాట్లాడిన మాటలు రాజకీయ రంగు పులుముకుని, ఇద్దరు అగ్ర నటుల అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్‌కు దారితీశాయి. సేతుపతి చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా దళపతి విజయ్ రాజకీయ అరంగేట్రం, ఆయన పార్టీని ఉద్దేశించినవేనంటూ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
బిగ్‌బాస్ వేదికపై సేతుపతి ఏమన్నారు?..
బిగ్‌బాస్ హౌస్‌లోని ఓ కంటెస్టెంట్ లీడర్‌షిప్ శైలిపై చర్చించే క్రమంలో విజయ్ సేతుపతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “ఎన్నికల ముందు అడ్డగోలు హామీలు ఇవ్వడం, అసలు సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి పారిపోవడం లీడర్‌షిప్ అనిపించుకోదు. ఎదురయ్యే సమస్యల నుంచి తప్పించుకోవడానికి ప్రతిపక్షాలను నిందించడం సరైన నాయకుడి లక్షణం కాదు” అని పేర్కొన్నారు. హామీలను నిలబెట్టుకోవడం, పూర్తి బాధ్యతను స్వీకరించడం, కష్ట సమయాల్లో వెనకడుగు వేయకుండా నిలబడటమే నిజమైన లీడర్‌కు ఉండాల్సిన లక్షణాలని సేతుపతి వివరించారు.
దళపతి విజయ్, టీవీకే వర్గాల ఆగ్రహం..
సేతుపతి తన వ్యాఖ్యల్లో ఏ ఒక్క రాజకీయ నాయకుడి పేరును గానీ, పార్టీ ప్రస్తావనను గానీ తీసుకురాలేదు. అయితే. తమిళనాడులో నటుడు విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) పార్టీ స్థాపించి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.విజయ్‌ను ఉద్దేశించే సేతుపతి ఈ విమర్శలు గుప్పించారని భావిస్తూ విజయ్ అభిమానులు, టీవీకే శ్రేణులు సోషల్ మీడియా వేదికగా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.గతంలో ‘మాస్టర్’ సినిమాలో ఇద్దరూ కలిసి నటించారని, విజయ్‌ను సేతుపతి సొంత సోదరుడిలా భావించేవారని, అలాంటిది ఇప్పుడు రాజకీయ విమర్శలు చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
విజయ్ టెలివిజన్ స్పష్టత – వివాదానికి ముగింపు పలికే యత్నం..
ఈ వివాదం మరింత ముదురుతుండటంతో షో నిర్వాహక సంస్థ విజయ్ టెలివిజన్ వివరణ ఇచ్చింది. ఆ వ్యాఖ్యలు కేవలం బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన గేమ్‌కు, కంటెస్టెంట్ల నిర్ణయాలకు మాత్రమే సంబంధించినవని స్పష్టం చేసింది. బయట రాజకీయాలతో గానీ, ఏ ఒక్క రాజకీయ నాయకుడితో గానీ వీటికి ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పింది. అనవసరంగా ఈ మాటలకు రాజకీయ రంగు పులమవద్దని, సంయమనం పాటించాలని సినీ విశ్లేషకులు ఇరువర్గాల అభిమానులకు సూచిస్తున్నారు.
