VasamShetty subash: రాష్ట్రంలోని సినీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. రాజమండ్రిలో ఫిల్మ్ చాంబర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సినీ వర్కర్స్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “సినీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై మీ వినతిపత్రం ఇవ్వండి. కార్మికుల ఇళ్ల స్థలాల విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటాం,” అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని, గోదావరి జిల్లాల్లో సినిమా షూటింగులకు అనుకూలమైన లొకేషన్లు కలవని మంత్రి వివరించారు. “ఇక్కడ చిత్రీకరణ జరిగే సినిమాల్లో స్థానిక కార్మికులకు అవకాశం కల్పించేందుకు కృషి చేస్తాం. నిర్మాతలు స్థానిక కార్మికుల పట్ల చిన్నచూపు చూడకుండా ఉండాలి,” అని ఆయన సూచించారు.