Tirupati: తిరుమల ఘాట్ రోడ్డులో మరోసారి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం ఉదయం మొదటి ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద ఒక కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు భక్తులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆశ్విని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ప్రమాదం జరిగిన సమయంలో భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఇదే ప్రాంతంలో కొద్దిసేపటి క్రితం ఒక బైక్ స్కిడ్ కావడంతో ఒకరికి గాయాలయ్యాయి. రోడ్డుపై ఆయిల్ లీకై ఉండటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
గతంలో, ఆరు రోజుల క్రితం కూడా తిరుమల ఘాట్ రోడ్డులో ఓ ప్రమాదం చోటుచేసుకుంది. హరిణి దాటిన తర్వాత రెండో ఘాట్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సు గోడను ఢీకొట్టింది. అయితే క్రాష్ బారియర్ పటిష్ఠంగా ఉండటంతో బస్సు రోడ్డుపైనే నిలిచిపోయింది. లేకపోతే బస్సు పక్కనే ఉన్న లోయలో పడే ప్రమాదం ఉండేది. ఆ ప్రమాదం సమయంలో భక్తులు పెను ప్రమాదం నుంచి బయటపడి ఊపిరి పీల్చుకున్నారు.