Vande Mataram Bill: జాతీయ గేయం ‘వందేమాతరం’ గౌరవాన్ని కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. వందేమాతరం గేయానికి సంబంధించిన ప్రత్యేక బిల్లును కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
1. బిల్లులోని ప్రధాన నిబంధనలు ఏంటి?
వందేమాతరం గేయాన్ని అవమానించినా, లేదా ఎవరైనా ఆలపిస్తుండగా అడ్డుకున్నా (ఆటంకం కలిగించినా) దానిని నేరంగా పరిగణిస్తారు. అలా చేసిన వారికి జైలు శిక్ష విధించేలా చట్టం రూపొందించారు. ఈ కొత్త నిబంధన ప్రకారం వందేమాతరం గేయంలోని మొదటి ఆరు చరణాలను తప్పనిసరిగా, పూర్తిగా ఆలపించాల్సి ఉంటుంది.
2. పార్లమెంట్‌లో రగడ.. రాజ్యసభ వాయిదా
ఈ బిల్లును సీపీఐ, సీపీఎంలతో పాటు ఇతర విపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. విపక్షాల నిరసనలు, ఆందోళనలతో రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. సోమవారం రోజున ఈ బిల్లుపై సభలో పూర్తిస్థాయి చర్చ జరగనుంది.
3. ‘వందేమాతరం’ చారిత్రక ప్రాధాన్యత
1905 నాటి బెంగాల్ విభజన ఉద్యమం నుంచి 1920 సహాయ నిరాకరణ, 1930 శాసనోల్లంఘన మరియు 1942 క్విట్ ఇండియా ఉద్యమాల వరకు స్వాతంత్య్ర పోరాటంలో ‘వందేమాతరం’ నినాదం బ్రిటిష్ పాలకులకు నిద్రలేకుండా చేసింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు సైతం చివరి శ్వాస వరకు ఈ నినాదాన్నే తలచారు.
4. అసలు వివాదం ఏంటి?
1937లో ముస్లిం లీగ్ నేత మహ్మద్ అలీ జిన్నా వందేమాతరాన్ని వ్యతిరేకించినప్పుడు, కాంగ్రెస్ పార్టీ మరియు జవహర్‌లాల్ నెహ్రూ వారికి మద్దతుగా నిలిచి గేయంలోని కొన్ని భాగాలను తొలగించారని ప్రధాని మోదీ ఆరోపించారు. గేయాన్ని ముక్కలు చేయడం ద్వారా నాటి కాంగ్రెస్ దేశ విభజనకు బీజం వేసిందని, అందుకే ఇప్పుడు పూర్తి గేయాన్ని తప్పనిసరి చేసేలా చట్టం తెస్తున్నామని కేంద్రం పేర్కొంది.
