Loan Apps: అత్యవసరాల కోసం తీసుకున్న రుణాలకు సంబంధించి ఈఎంఐలు ఆలస్యమైతే చట్టవిరుద్ధ లోన్ యాప్స్ ఆగడాలు ఏ స్థాయికి దిగజారుతున్నాయో తెలిపే మరో దారుణ ఘటన నగరంలో వెలుగుచూసింది. బాకీ పడ్డ డబ్బులు చెల్లించలేదన్న కోపంతో, ఏకంగా పదో తరగతి చదువుతున్న మైనర్ బాలిక ఫోటోలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామంటూ వేధింపులకు గురిచేయడం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్ శివారు ప్రాంతమైన బోడుప్పల్‌కు చెందిన మహిళ ‘వర్ధాన్’ అనే లోన్ యాప్ నిర్వాహకుల ఆగడాలపై పోలీసులను ఆశ్రయించింది.
బంధువుల కోసం రుణం – చివరికి ముదిరిన వివాదం..
బోడుప్పల్ ప్రాంతంలో నివాసముంటున్న మహిళ తన బంధువులకు అత్యవసరంగా డబ్బు అవసరం పడటంతో, తన వద్ద నగదు లేక ‘వర్ధాన్’ అనే ఆన్లైన్ లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకుని వారికి సహాయం చేసింది. మొదట్లో కొన్ని నెలల పాటు ఈఎంఐలను సకాలంలోనే చెల్లించింది. అయితే అసలు రుణం తీసుకున్న బంధువులు తిరిగి డబ్బులు ఇవ్వడంలో విఫలం కావడంతో, ఆమె కొద్ది రోజులుగా యాప్‌కు ఈఎంఐలు చెల్లించలేకపోయింది.
అసభ్య దూషణల నుంచి మార్ఫింగ్ బెదిరింపుల దాకా..
ఈఎంఐలు నిలిచిపోవడంతో ప్రారంభంలో ఫోన్లు చేసి డబ్బులు కట్టాలని కోరిన రికవరీ ఏజెంట్లు, ఆ తర్వాత తీవ్రస్థాయిలో అసభ్య పదజాలంతో దూషించడం, బెదిరించడం మొదలుపెట్టారు. ఏజెంట్ల ఆగడాలు మితిమీరడంతో ఆమె ఆ నంబర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది.
ఫోన్ నంబర్లు బ్లాక్ చేశారన్న అక్కసుతో లోన్ యాప్ నిర్వాహకులు బరితెగించారు. సదరు మహిళ ఫోన్ డేటాను చోరీ చేసి, ఆమె పదో తరగతి చదువుతున్న మైనర్ కూతురి ఫోటోలను సేకరించారు. ఆ ఫోటోలను అత్యంత అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి నేరుగా తల్లి వాట్సాప్కే పంపించారు. వెంటనే డబ్బులు కట్టకపోతే ఈ అశ్లీల మార్ఫింగ్ ఫోటోలను బంధువులతో పాటు సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తామంటూ నిర్భయంగా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డారు.
పోలీసులకు ఫిర్యాదు – దర్యాప్తు ప్రారంభం..
నిర్వాహకుల పైశాచిక వేధింపులతో తీవ్ర మానసిక క్షోభకు గురైన బాధితురాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు ఆధారాలతో సహా అధికారికంగా ఫిర్యాదు చేసింది. మైనర్ బాలిక మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులకు పాల్పడిన నిందితులపై పోక్సో (POCSO), ఐటీ చట్టం (IT Act), మహిళల వేధింపుల నిరోధక చట్టం కింద కఠిన సెక్షన్లతో పోలీసులు కేసు నమోదు చేసి, ఆ లోన్ యాప్ మూలాలు, సైబర్ నేరగాళ్ల నెట్‌వర్క్‌పై విస్తృత దర్యాప్తు ప్రారంభించారు.
