TG Assembly: తెలంగాణ శాసనసభ వర్షాకాల సమావేశాల మూడో రోజున ఊహించని తీవ్ర పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన భారత రాష్ట్ర సమితి (BRS) ఎమ్మెల్యేలందరినీ ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల కాలం మొత్తానికి సస్పెండ్ చేస్తూ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
సభ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారన్న కారణంతో ప్రతిపక్ష నేత కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, కోవా లక్ష్మి, సునీతా లక్ష్మారెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి సహా బీఆర్ఎస్ శాసనసభ్యులందరిపై సస్పెన్షన్ వేటు పడింది.
పోడియం ముట్టడి – ‘వీ వాంట్ జస్టిస్’ నినాదాలు..
మంగళవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్‌ను కాంగ్రెస్ ఎస్సీ సెల్ శ్రేణులు దప్పుల మోతతో ముట్టడించేందుకు యత్నించడం, ఆ తర్వాత చోటుచేసుకున్న అరెస్టులపై బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం మూడో రోజు సభ ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెల్‌లోకి దూసుకెళ్లి స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు.
మంత్రులు మాట్లాడుతున్న సమయంలో అడ్డుతగులుతూ తమకు న్యాయం చేయాలంటూ (We Want Justice) పెద్దపెట్టున నినాదాలు చేశారు. వెంటనే సభ్యులంతా తమ స్థానాలకు వెళ్లి కూర్చోవాలని, సభను సజావుగా సాగనివ్వాలని స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ బీఆర్ఎస్ నేతలు నిరసనను కొనసాగించారు.
మంత్రి శ్రీధర్ బాబు తీర్మానం – మూజువాణి ఆమోదం..
బీఆర్ఎస్ సభ్యులు ఉద్దేశపూర్వకంగా సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సభ దృష్టికి తెచ్చారు. గత గంటసేపటి నుంచి సభ నడవకుండా ఆందోళనకు దిగుతున్న సభ్యులందరినీ సభ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతూ ఆయన అధికారిక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
ప్రభుత్వ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకున్న స్పీకర్ ప్రసాద్ కుమార్.. బీఆర్ఎస్ సభ్యులందరినీ ప్రస్తుత వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించి, సభను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.
మరోవైపు, శాసనసభ పరిణామాలకు నిరసనగా శాసనమండలి సమావేశాల నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు.నిన్ననే ఇద్దరు ఎమ్మెల్సీలు (తాతా మధు, నవీన్ రెడ్డి) సస్పెన్షన్‌కు గురికాగా, నేడు ఏకంగా అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరిపై సస్పెన్షన్ వేటు పడటంతో రాష్ట్ర రాజకీయాలు తారాస్థాయికి చేరాయి.
