దళితులు అడుగుపెట్టిన ప్రాంతాన్ని పసుపు నీళ్లతో కడగడం యావత్ దళిత సమాజాన్ని అవమానించడమేనని, ఈ భూస్వామ్య అహంకార వైఖరిని సమాజం ఎంతమాత్రం సహించబోదని స్పష్టం చేశారు.
ఇది ఆత్మగౌరవ సమస్య.. ఇక భరించేది లేదు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సభాపతిని అవమానించడం, నిరసన ప్రాంతాన్ని శుద్ధి చేయడంపై డిప్యూటీ సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పదేళ్ల పాటు మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించిన సీనియర్ నాయకులు రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవిని కించపరిచేలా మాట్లాడటం దురదృష్టకరమని భట్టి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన అవమానాలు ఇప్పటికే హద్దులు దాటాయని, ప్రజాస్వామ్య సమాజానికి ఇక భరించే ఓపిక లేదని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ ఎస్సీ సెల్ చేపట్టిన కార్యక్రమంలో భాగంగా వరదరాజపూర్ నుంచి ఆందోళనకారులు వెళ్లిన దారులను బీఆర్ఎస్ నేతలు పసుపు నీళ్లతో శుద్ధి చేయడాన్ని భట్టి తీవ్రంగా తప్పుబట్టారు. “దళితులు తిరిగారని రోడ్లపై పసుపు నీళ్లు చల్లుతారా? మనం ఏ కాలంలో, ఏ సమాజంలో బతుకుతున్నాం?” అని నిలదీశారు.
దళితులను అడుగడుగునా అవమానించి, తిరిగి సభకు వచ్చి తమకే అన్యాయం జరిగిందన్నట్లుగా బీఆర్ఎస్ సభ్యులు ‘వీ వాంట్ జస్టిస్’ అని నినాదాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. “మీ బెదిరింపులకు, సవాళ్లకు ఇక్కడ ఎవరూ భయపడరు. ఇది బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవ సమస్య. దళిత బిడ్డ అయిన సభాపతికి ఈ ప్రజా ప్రభుత్వం సంపూర్ణంగా అండగా నిలుస్తుంది” అని స్పష్టం చేశారు.
దళితులు అడుగుపెడితే ఊరు మైల పడ్డదా?.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ దళిత వ్యతిరేక విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. “దళితులు రోడ్డుపై నడిస్తే ఆ ఊరు మైల పడిందా? పసుపు నీళ్లతో రోడ్లు కడగాల్సిన అవసరం ఏమొచ్చింది?” అని అడ్లూరి సూటిగా ప్రశ్నించారు. ఈ అమానవీయ ఘటనకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బాధ్యత వహించి యావత్ దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దళితులు సమాజంలో ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఇంకా పాతకాలపు అంటరానితనం, వివక్షను ప్రోత్సహించేలా ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని కుట్రలు చేసినా బడుగు వర్గాల హక్కుల కోసం ప్రభుత్వం దృఢంగా నిలబడుతుందని పేర్కొన్నారు.