Tirumala: కలియుగ వైకుంఠమైన తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉంది. వీకెండ్ కావడం, ఎండల సెలవులు కూడా తోడవడంతో తిరుమల కొండకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు ఇప్పటికే భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. లోపల చోటు లేకపోవడంతో వేలాది మంది భక్తులు వెలుపల ఉన్న క్యూలైన్లలో ఓపికగా వేచి ఉన్నారు.
ప్రస్తుతం తిరుమలలో సర్వదర్శనం కోసం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారిని దర్శించుకోవడానికి దాదాపు 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లు, క్యూలైన్లలో ఉన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి ఎప్పటికప్పుడు తాగునీరు, పాలు, అన్నప్రసాదాలను అందిస్తున్నారు.
మరోవైపు, స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. నిన్న ఒక్కరోజే మొత్తం 84,315 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారిలో 43,033 మంది భక్తులు స్వామివారికి తమ తలనీలాలు సమర్పించి భక్తిని చాటుకున్నారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రద్దీ ఎక్కువగా ఉన్నందున భక్తులు గమనించి తమ తిరుమల యాత్రను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
